Reading Time: 2 minutes
Coffee: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్ ఏది..? ఈ తప్పులు చేస్తే మీ శరీరంలో జరిగేది ఇదే..

ఈ రోజుల్లో ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి స్ట్రాంగ్ కాఫీ పడకపోతే చాలా మందికి అసలు రోజే గడవదు. నిద్ర మబ్బు వదిలించుకోవడానికి, ఆఫీస్ పనిలో యాక్టివ్‌గా ఉండటానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా రోజుకు మూడు నాలుగు సార్లు కాఫీలు లాగించేయడం కాఫీ ప్రియులకు సర్వసాధారణమైన అలవాటుగా మారిపోయింది. అయితే అమృతం లాంటి కాఫీని కూడా సరైన పద్ధతిలో, సరైన సమయంలో తాగకపోతే అది ఒక స్లో పాయిజన్‌లా మారి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితంగా కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా మారడం, బరువు తగ్గడం వంటి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దానికి ఒక పక్కా టైమ్ లిమిట్ ఉంది.

కాఫీ తాగడానికి బెస్ట్ టైమింగ్స్ ఇవే..

ఉదయం 9:30 నుండి 11:30 మధ్య: ఉదయాన్నే కాఫీ తాగడానికి ఇది అత్యంత ఉత్తమమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ టైమ్‌లో కాఫీ తాగితే మెదడు చురుగ్గా మారి, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

మధ్యాహ్నం 2:00 నుండి 4:00 మధ్య: లంచ్ తర్వాత వచ్చే నీరసాన్ని, బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఈ సమయంలో కాఫీ తాగడం మంచిది. ఇది మీ ఎనర్జీ లెవెల్స్‌ను తిరిగి పెంచుతుంది.

ఈ సమయాల్లో అస్సలు తాగొద్దు..

బెడ్ కాఫీ: చాలా మందికి నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు ఇది తీవ్రమైన ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం, కడుపు పూత వంటి సమస్యలకు దారితీస్తుంది.

సాయంత్రం 4 గంటల తర్వాత: సాయంత్రం ఆలస్యంగా కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. కాఫీలోని కెఫీన్ మన శరీరంలో 6 నుండి 8 గంటల పాటు ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రాత్రి వేళల్లో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అలాగే, ఇది మీ ఆకలిని కూడా చంపేస్తుంది.

మితంగా కాఫీ తాగడం వల్ల కలిగే 8 సూపర్ బెనిఫిట్స్..

రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు సరైన సమయంలో తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

అల్జీమర్స్‌కు చెక్: క్రమం తప్పకుండా మితంగా కాఫీ తాగే వారికి జ్ఞాపకశక్తి క్షీణించే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 65 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ నివారణ: కాఫీలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

గుండె ఆరోగ్యం: హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

టైప్-2 డయాబెటిస్: మధుమేహం వచ్చే ముప్పును ఇది నివారిస్తుంది.

వెయిట్ లాస్: బరువు నియంత్రణలో ఉంచడానికి, మెటబాలిజం పెంచడానికి తోడ్పడుతుంది.

డిప్రెషన్ కంట్రోల్: కాఫీలోని కెఫీన్ మూడ్‌ను మెరుగుపరిచి, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.