Reading Time: < 1 minute

అంతర్జాతీయ ప్రమాణాలతో  పర్యాటక కేంద్రాల అభివృద్ధి

Caption of Image.
  • కేంద్రం ఒక్కో డెస్టినేషన్‌‌‌‌కు రూ. 500 కోట్ల వరకు సాయం
  • ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగం బలోపేతం
  • హైదరాబాద్‌‌‌‌లో రాష్ట్రస్థాయి వర్క్‌‌‌‌షాప్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ‘గ్లోబల్ స్టాండర్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ల అభివృద్ధి’పై బుధవారం హైదరాబాద్‌‌‌‌ బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌‌‌‌లో రాష్ట్రస్థాయి వర్క్‌‌‌‌షాప్ నిర్వహించారు.

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్, పలు జిల్లాల కలెక్టర్లు, పర్యాటక రంగ నిపుణులు పాల్గొన్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌‌‌‌లో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్– బేస్డ్‌‌‌‌’ పద్ధతిలో ప్రపంచ స్థాయి టూరిస్ట్‌‌‌‌ డెస్టినేషన్ల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించనుంది.

ఈ పథకంలో ఎంపికైన ఒక్కో పర్యాటక కేంద్రానికి గరిష్టంగా రూ. 500 కోట్ల వరకు ఆర్థిక సాయం అందే అవకాశం ఉంది. పర్యాటక ప్రాంతాల సమర్థ నిర్వహణ కోసం డెస్టినేషన్ మేనేజ్‌‌‌‌మెంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయాలని, పనితీరును బట్టి ప్రోత్సాహకాలు (పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్‌‌‌‌) అందించే విధానాన్ని తీసుకురావాలని ఈ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో చర్చించారు. పర్యాటక ప్రాంతాల్లో కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా.. పరిశుభ్రత, భద్రత, రవాణా అనుసంధానం, డిజిటల్ సేవలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు.

ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పర్యాటక హబ్‌‌‌‌లను నిర్మించాలని సమావేశంలో సూచించారు. ఈ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో వికారాబాద్ కలెక్టర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్లతోపాటు హాస్పిటాలిటీ, విమానయాన రంగ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. సమావేశంలో వచ్చిన సిఫార్సులను ప్రభుత్వం జులైలో జరగనున్న ‘డెవలపింగ్ గ్లోబల్ స్టాండర్డ్ టూరిస్ట్ డెస్టినేషన్స్’ జాతీయ సదస్సులో సమర్పించనుంది. 

©️ VIL Media Pvt Ltd.