Reading Time: < 1 minute
ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు.

అమరావతిలో మంత్రి మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు నమోదయ్యాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకానికి కూడా మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర కేబినెట్ టూరిస్ట్ బస్సు యజమానులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) బస్సులపై విధిస్తున్న త్రైమాసిక పన్నును ప్రతి సీటుకు రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టూరిస్ట్ బస్సు యజమానుల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పన్ను తగ్గింపుతో ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన బస్సుల రిజిస్ట్రేషన్లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా, వాహనాల భద్రత, ఫిట్‌నెస్ పర్యవేక్షణ కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. టూరిజం రంగానికి కొత్త ఊపిరి పోసే ఈ నిర్ణయంతో పాటు మహిళలకు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయాలకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…