
- రెండు వారాలుగా స్తబ్దత.. ప్రస్తుతం యాక్టివ్
- మంగళవారం కరీంనగర్లో
- 23.6 సెంటీ మీటర్ల వర్షం
- సోమవారం అర్ధరాత్రి
- నుంచి జోరందుకున్న వర్షాలు
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటికీ విస్తరించాయి. రెండు వారాలుగా స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు.. మంగళవారం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ తాకాయి. ఇటు మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన క్యాచ్‌మెంట్ ఏరియా అయిన మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకూ రుతుపవనాలు వ్యాపించాయి. ప్రస్తుతం రుతుపవనాలు యాక్టివ్‌గా కదులుతున్నాయని, వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వారంపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
రుతుపవనాలు విస్తరించడంతో రాష్ట్రంపై వాటి ప్రభావం కనిపిస్తున్నది. సోమవారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఇటు మంగళవారం ఉదయం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మంగళవారం అతిభారీ వర్షం కురిసింది. ఆ జిల్లా రేణికుంటలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షాకాలంలో నమోదైన అత్యధిక వర్షపాతం ప్రస్తుతానికి ఇదే. ఇటు ములుగు జిల్లా మల్లంపల్లిలో 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. అయితే, సోమవారం అర్ధరాత్రి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది.
పెద్దపల్లి జిల్లా కూనారంలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో 13 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో 12.2 సెంటీమీటర్లు, జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 11, జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 10.6, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 10.5, కమాన్‌పూర్‌లో 10.2, కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 10, ములుగు జిల్లా మల్లూరులో 9.3, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 8.6, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 7.7, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఇటు హైదరాబాద్ సిటీ పరిధిలోనూ సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. చందానగర్‌లో 12.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో 12, మియాపూర్‌లో 11.4, మైలార్‌దేవ్‌పల్లిలో 11.2, గచ్చిబౌలిలో 10.4, బీహెచ్‌ఈఎల్‌లో 10.4, హెచ్‌సీయూ వద్ద 8.6, అమీన్‌పూర్‌లో 7.2, శాస్త్రిపురంలో 6.6 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇప్పటిదాకా రాష్ట్రంలో 48 శాతం మేర లోటు వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటిదాకా 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 53 మిల్లీమీటర్ల వర్షపాతం
నమోదైనట్టు పేర్కొంది.