Reading Time: < 1 minute

రాజ్యసభలో మన ఎంపీలే రిచ్… ఏడుగురు సిట్టింగ్ ఎంపీల ఆస్తులు రూ. 8 వేల 310 కోట్లు

Caption of Image.
  • అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీల్లో బీజేపీ తర్వాత ‌బీఆర్ఎస్
  • ఎలక్షన్ వాచ్ సంస్థ ఏడీఆర్ రిపోర్ట్ లో వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  226 సభ్యుల్లో తెలంగాణకు చెందిన సిట్టింగ్ ఎంపీలు రిచెస్ట్ పర్సన్స్‌‌గా నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి నలుగురున్నారు. ఈ ఏడుగురు ఎంపీల ఆస్తులు రూ.8,310 కోట్లు కాగా… కేవలం బీఆర్ఎస్ ఎంపీల ఆస్తులే రూ.5,524 కోట్లు అని ప్రముఖ ఎలక్షన్ వాచ్ సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్’(ఏడీఆర్) వెల్లడించింది. 

రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల ఎలక్షన్ అఫిడివిట్ ఆధారంగా వారి ఆస్తులు, క్రిమినల్ కేసులు, ఇతర వ్యక్తిగత వివరాలతో బుధవారం రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో రాజ్యసభ ఎంపీల్లో బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ బండి పార్థ సారథి రూ.5,300 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ ఎంపీ రవీందర్ గుప్తా(పంజాబ్) రూ. 5,053 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ(తెలంగాణ నుంచి)  రూ.2,558 కోట్లు ఉన్నారు. 

రూ.3.79 లక్షలతో ఎంపీగా పంజాబ్‌కు చెందిన సంత్ బల్బీర్ సింగ్(ఆప్) అత్యల్ప ఆస్తులు ఉన్న ఎంపీగా నిలిచారు. దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన టాప్ టెన్ పార్టీల్లో బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉంది. వందమందికి పైగా ఉన్న బీజేపీ సభ్యుల ఆస్తులు రూ. 8,181 కోట్లు కాగా.. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీల ఆస్తులు రూ.5,524 కోట్లుగా ఏడీఆర్ వెల్లడించింది. మూడో స్థానంలో రూ. 3,781కోట్లతో కాంగ్రెస్(29 మంది ఎంపీలు) ఉంది.

©️ VIL Media Pvt Ltd.