
తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే భక్తుల నుంచి నిర్ణీత బస్సు చార్జీల కంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వాహనాలపై దృష్టి సారించారు. తనిఖీల్లో భాగంగా సోమవారం (జూన్ 22) మొత్తం 42 వాహనాలను చెక్ చేయగా.. అందులో 25 వాహనాలు భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రతి వాహనానికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.25,000 జరిమానా విధించారు.
వాహన యజమానులు, డ్రైవర్లకు భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు నిర్ణయించిన చార్జీల ప్రకారమే రవాణా సేవలు అందించాలని సూచించారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
►ALSO READ | పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. కానీ రాజకీయాలు వద్దు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఇకపై ఎవరైనా భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసినట్లు గుర్తించినట్లయితే, సంబంధిత వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా అధిక చార్జీలు వసూలు చేసినట్లయితే వెంటనే ట్రాఫిక్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.