Reading Time: < 1 minute
Hyderabad: రేయ్ ఎవర్రా మీరంతా.. పైకేమో వన్‌ప్లస్ బ్రాండెడ్.. లోపలేమో అంతా తుస్.. నమ్మితే అంతే సంగతులు..

‘‘ఇందుగలడందులేదని సందేహము వలదు’’ అన్నట్లు.. ప్రతి రంగంలో ఫేక్ మాఫియా పెనవేసుకుపోయింది.. తినే ఆహారం నుంచి తాగే నీళ్ల వరకు.. ఉపయోగించే దుస్తుల నుంచి వాడే పరికరాల వరకు.. అన్ని నకిలీనే.. ఇప్పటికే.. ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో చోట్ల నకిలీ వస్తువుల గుట్టురట్టయింది.. టాప్ బ్రాండెడ్ నుంచి.. సామాన్యల వస్తువుల వరకు అన్నింటినీ కేటుగాళ్లు అచ్చం అలాంటివే తయారు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మహానగరంలో నకిలీగాళ్ల గుట్టు మరోసారి బయటపడింది. అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో నకిలీ వన్‌ప్లస్ ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు భారీ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.12 లక్షల విలువైన నకిలీ వన్‌ప్లస్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, జగదీష్ మార్కెట్‌లో పటేల్ మొబైల్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్న రామ్ చౌదరి అనే వ్యక్తి గత కొంతకాలంగా వన్‌ప్లస్ కంపెనీ పేరుతో నకిలీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. వినియోగదారులను మోసం చేస్తూ అసలైన వన్‌ప్లస్ ఉత్పత్తుల మాదిరిగానే కనిపించే నకిలీ నెక్‌బ్యాండ్లు, ఇయర్‌పాడ్స్, ఛార్జర్లు, అడాప్టర్లను మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ విషయంపై వన్‌ప్లస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అబిడ్స్ పోలీసులు దుకాణంపై దాడి నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులు బయటపడ్డాయి.. పోలీసులు పెద్ద మొత్తంలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం రామ్ చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో కాపీరైట్ యాక్ట్‌తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

నకిలీ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, వినియోగదారులు కూడా కొనుగోలు చేసే ముందు ఉత్పత్తుల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో అబిడ్స్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తుల వ్యాపారంపై మరోసారి చర్చ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..