Reading Time: 2 minutes
Veerabhadruni Rahasyam Telugu Web Series Streaming Date Zee5 Marmadesam

1990ల కాలంలో బుల్లితెరపై కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, ఐఎండీబీలో హయ్యెస్ట్ రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మిస్టరీ సిరీస్ ‘మర్మదేశం’ ప్రపంచం నుండి ‘వీరభద్రుని రహస్యం’ అనే సరికొత్త ఉత్కంఠభరితమైన లాంగ్-ఫార్మ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జూన్ 26 నుండి జీ5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ కథ అంతా రహస్యాలకు నిలయమైన ‘వీరభద్రపురం’ అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. తరతరాలుగా అక్కడి ప్రజలు తమ గ్రామ దైవమైన వీరభద్ర స్వామిని అమితంగా నమ్ముతుంటారు. స్వామివారి అండలోనే బతుకుతున్న ఆ ఊరిలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడే నేరుగా శిక్షిస్తాడనేది వారి గాఢ విశ్వాసం.

అయితే, ఆ నమ్మకమే ఒక పెద్ద భయంగా మారుతుంది. ఆ ఊరిలోని పురాతన ఆలయంలో పవిత్ర గంట మోగినప్పుడల్లా.. గుడి పరిసరాల్లోనో, లేదా శపించబడిన కొండపైనో ఒక శవం ప్రత్యక్షమవుతుంది. జరిగే మరణాలను గ్రామస్తులంతా ‘దైవ న్యాయం’ అని మౌనంగా నమ్ముతారే తప్ప.. ఆ చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని ప్రశ్నించడానికి దశాబ్దాలుగా ఎవరూ ధైర్యం చేయరు. ఇలాంటి మూఢనమ్మకాలతో నిండిన వింత ప్రపంచంలోకి సిటీ నుండి ‘వెన్నెల’ (నటి అన్నీ) అనే ఒక ధైర్యవంతురాలైన యువతి అడుగుపెడుతుంది. ఆమె వచ్చిన సమయంలోనే ఊరిలో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురవుతాడు. ఊరి జనం దాన్ని దైవ శిక్షగా కొట్టిపారేసినా.. వెన్నెల మాత్రం ఆ అంధ విశ్వాసాన్ని ఒప్పుకోదు. నిజాన్ని ఎలాగైనా వెలికితీయాలనే ఆమె పట్టుదల శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుంది. ఈ క్రమంలో గతాన్ని దాచాలని చూసే ఊరిలోని కొందరు శక్తివంతమైన వ్యక్తులతో ఆమెకు పోరాటం మొదలవుతుంది. వెన్నెల అన్వేషణ లోతుగా సాగేకొద్దీ భక్తి పేరుతో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలు, దోపిడీలు, 1970ల కాలం నాటి ఆ గ్రామం చీకటి గతం బయట పడుతుంది.

భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌లో వెన్నెలగా అన్నీ మెప్పించనుండగా.. యోగానందంగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, ఎస్‌ఐ రవిగా అభినవ్, డాక్టర్ నందగా కమల్ తూము కీలక పాత్రల్లో నటించారు. అనురాధ, బాలచంద్ర, కల్కి, శిరీష మరియు హార్విన్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సుభాష్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సిరీస్‌కు సుధా శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చగా.. రుద్రరాజు చాణక్య వర్మ స్క్రీన్‌ప్లే, అంజన్ మేగోటి సంభాషణలు రాశారు. మొత్తం 60 ఎపిసోడ్‌ల నిడివితో రూపొందిన ఈ లాంగ్-ఫార్మ్ మిస్టరీ సిరీస్ జూన్ 26న మొదటి రెండు ఎపిసోడ్‌లతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌లు యాడ్ అవుతాయి.