
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఎంపీలు– సంజయ్ హరిభౌ జాదవ్, భౌసాహెబ్ రాజారామ్ వాక్‌చౌరే, ఓంప్రకాష్ భూపాల్‌సింగ్ నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్, నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికర్ సోమవారం (జూన్ 22) షిండే సమక్షంలో శివసేన గూటికీ చేరారు. తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉన్న ఆపరేషన్ టైగర్ కంప్లీట్ అయ్యింది. ఒకేసారి ఆరుగురు ఎంపీలు పార్టీని వీడటంతో ఉద్ధవ్ వర్గానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఎంపీల చేరిక సందర్భంగా షిండే మాట్లాడుతూ.. మాదే అసలైన శివసేన పార్టీ అని అన్నారు. బాల్ థాక్రే ఆశయాలను కొనసాగించేది మేమేనని పేర్కొన్నారు. ఉద్ధవ్ వర్గం నుంచి ఆరుగురు ఎంపీలు తమ వైపుకు రావడం మా వర్గానికి పెద్ద ఊరట అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క పులి కాదు.. ఆరుగురు పులులు ఉన్నారని పరోక్షంగా ఆపరేషన్ టైగర్‌ను ప్రస్తావించారు.
ఎంపీలపై అనర్హత వేటు పడుతుందా..?
శివసేన (యూబీటీ)కి ప్రస్తుతం తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఇందులో ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి జంప్ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ అవసరం. అంటే శివసేనకు తొమ్మిది మంది ఎంపీలు ఉండగా.. అందులో ఆరుగురు ఎంపీలు వేరే పార్టీలో జాయిన్ కావాలి. అప్పుడు వారికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఈ సంఖ్యకు అనుగుణంగానే ఉద్ధవ్ వర్గం నుంచి సరిగ్గా ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో విలీనం కావడం వల్ల వారికి చట్టపరమైన ఇబ్బందులు ఏవీ ఉండవు.
►ALSO READ | లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య