Reading Time: < 1 minute

AIADMK కు దెబ్బ మీద దెబ్బ.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా. .విజయ్ టీవీకేలోకి జంప్.!

Caption of Image.

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై.. అంతర్గత సంక్షోభంతో సతమతమవుతున్న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు కోలుకోలేని భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి.. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్.. ఈ ముగ్గురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకరన్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. ప్రస్తుతం స్పీకర్ వీరి రాజీనామాలను ఆమోదించారా లేదా.. లేక లీగల్‌గా సమీక్షిస్తారా అనే ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాజీనామా లేఖలు సమర్పించిన వెంటనే.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను ఆయన ఛాంబర్‌లో కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరంతా త్వరలోనే సీఎం విజయ్ సమక్షంలో అధికారికంగా టీవీకే కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రాజీనామాల అనంతరం జరగబోయే ఉప ఎన్నికల్లో వీరు టీవీకే అభ్యర్థులుగా మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.

నిజానికి ఏఐఏడీఎంకేలో ఈ తిరుగుబాటు ఇప్పుడే మొదలైంది కాదు. సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వానికి గుడ్ బై చెప్పిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ తిరుగుబాటు వర్గంలో భాగమేనని తెలుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.