
కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీలు కేవలం లాభాలు, టార్గెట్లు, పని ఒత్తిడి చుట్టూనే తిరుగుతుంటాయి. ఉద్యోగులను కేవలం పనిముట్లుగా చూసే ఈ కాలంలో.. ఢిల్లీకి చెందిన ఒక సీఈఓ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఎలైట్ మార్క్యూ అనే పీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రజత్ గ్రోవర్.. తన ఉద్యోగుల కోసం ఒక అద్భుతమైన పేరెంటల్ పెర్క్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. పిల్లల ఎదుగుదల కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత చూపేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
రజత్ గ్రోవర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ.. తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ తల్లిదండ్రులను 3 రోజుల విహారయాత్రకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కంపెనీ తరపున ఒక్కొక్కరికీ రూ.10వేలు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా, ఆ మూడు రోజులను అదనపు పెయిడ్ లీవ్స్ గా పరిగణిస్తామని ప్రకటించారు. అంటే ఉద్యోగికి ఉన్న సాధారణ సెలవుల కోటా నుంచి ఒక్క రోజు కూడా తగ్గదనమాట. “మనం ఎప్పుడూ ‘ఏదో ఒక రోజు’ అని వాయిదా వేస్తుంటాం.. కానీ మన కోసం తమ జీవితాన్నే ధారపోసిన తల్లిదండ్రుల విషయంలో రేపు అనేది గ్యారెంటీ లేదు. అందుకే వారిని ఇప్పుడే తీసుకువెళ్లండి, ఆలస్యం చేయకండి” అంటూ సీఈఓ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
తమ కలలను పక్కన పెట్టి పిల్లల కలల కోసం కష్టపడే తల్లిదండ్రుల గొప్పతనాన్ని గ్రోవర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను కంపెనీని నిర్మించకముందే.. ఎవరో ఒకరు తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి తనకు ఆహారం వండి పెట్టారని, ఇంటిని చక్కదిద్దారన్నారు. అందుకే తాన కలలను నిజం చేసుకోగలిగానంటూ తల్లిదండ్రుల శ్రమను కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని, విలువలను నిర్మించింది వారే అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే తాను ఇదంతా చేస్తోంది పబ్లిసిటీ కోసం కాదని, ఉద్యోగులు తమ బిజీ లైఫ్ నుంచి కాస్త సమయం కేటాయించి.. తల్లిదండ్రుల కోరికలను అడిగి తెలుసుకోవాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచమంతా ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎంత బాగుంటుందో అని ఒకరు కామెంట్ చేశారు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి విలువలు కలిగిన నాయకుడిని చూడటం చాలా అరుదు అంటూ మరొకరు పోస్ట్ పెట్టారు. ఉద్యోగుల మానసిక స్థితిని, వారి కుటుంబ బంధాలను గౌరవించే రజత్ గ్రోవర్ వంటి ‘బాస్ ఆఫ్ ది ఇయర్’ నాయకత్వం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం బోనస్‌లు ఇవ్వడమే కాకుండా, అనుబంధాలకు విలువనిచ్చే ఇలాంటి నిర్ణయాలు ఉద్యోగులలో కంపెనీ పట్ల గౌరవాన్ని, పని పట్ల ఉత్సాహాన్ని మరింత పెంచుతాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.