July 11, 2026

Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!

Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
Reading Time: < 1 minute
Suvendu Adhikari Sworn In As West Bengal First Bjp Chief Minister

Suvendu Adhikari: ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా, ఆమెకు ‘కుడి భుజం’గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో బీజేపీ (BJP) తరపున బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి (R.N. Ravi) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దాదాపు కేంద్ర మంత్రిమండలి హాజరైంది.

ముఖ్యంగా, మమతా బెనర్జీ ధరించే సాదాసీదా తెల్లచీర, రబ్బరు చెప్పుల తరహాలోనే.. సువేందు సైతం అత్యంత నిరాడంబరంగా కాషాయ రంగు కుర్తా ధరించి ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్, శంకర్ ఘోష్‌లు సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ విజయం బీజేపీకి ఎంత కీలకమో చాటిచెప్పేలా, ప్రధానితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలం కావడంతో బెంగాల్ గడ్డపై అధికారం చేపట్టడాన్ని ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ఈ వేడుక కోసం బీజేపీ మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. ఆ రోజు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (రవీంద్ర జయంతి). బీజేపీని ‘ఉత్తర భారత పార్టీ’ అని, బెంగాలీ సంస్కృతిని గౌరవించదని టీఎంసీ చేసే ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ తేదీని నిర్ణయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, సభా ప్రాంగణం విషయానికి వస్తే.. బెంగాలీ సంస్కృతికి అద్దం పట్టేలా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో వినూత్న ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద దాదాపు 20 స్వీట్ల స్టాళ్లతో పాటు, బెంగాల్ ప్రత్యేకం అయిన ‘ఝల్మురీ’ (మరమరాల మిశ్రమం) స్టాళ్లను సైతం ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్‌లో ఝర్‌గ్రామ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ అనూహ్యంగా ఆగి ఈ ఝల్మురీని రుచి చూడటంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.