Reading Time: 2 minutes
Ys Jagan Alleges Declining Government Support To Rural Economy Criticizes Mgnrega Performance

YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. గ్రామీణ ప్రజలకు కీలకంగా ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం సమర్థవంతంగా అమలు కావడం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల చేతిలో ఖర్చు చేయగలిగే ఆదాయం పెరుగుతుందని, దాంతో గ్రామీణ మార్కెట్లలో వినియోగం పెరిగి ఆర్థిక చలనం వస్తుందని వివరించారు.

Read Also: Kejriwal: దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న కేజ్రీవాల్

ఎక్కువగా ఖర్చు చేసే వర్గాల చేతిలో డబ్బు ఉంటే గ్రామీణ ఆదాయ వినియోగం పెరుగుతుందని, అది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అన్నారు వైఎస్‌ జగన్‌. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో దేశవ్యాప్తంగా అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. అయితే, గత రెండేళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనితీరు తీవ్రంగా పడిపోయిందని జగన్ విమర్శించారు. లేబర్ బడ్జెట్, పని చేసిన కుటుంబాల సంఖ్య, ఖర్చు చేసిన నిధులు వంటి అన్ని అంశాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోందని ఆరోపించారు.

గత రెండేళ్లలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి రేట్లు కూడా తగ్గాయని జగన్ తెలిపారు. ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందనే సంకేతమని అన్నారు. ప్రజల చేతిలో డబ్బు లేకపోవడంతో డిమాండ్ పడిపోతుందని, దాని ప్రభావం వ్యాపార రంగంపై కూడా పడుతోందని చెప్పారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం విఫలమవుతోందని దుయ్యబట్టారు.. అవినీతి ఆరోపణలు, సంపద కూడబెట్టాలనే అధిక ఆశలతో ప్రభుత్వం దారి తప్పుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.