Reading Time: < 1 minute
Nepal Salary Policy Biweekly Pay Government Employees Economic Boost

ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారు? నెల రోజులు పని చేశాక ఇస్తారు? ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నేపాల్‌లో పద్దతులు మారిపోయాయి. శాలరీ విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇకపై నెలవారీ ప్రకారం కాకుండా ప్రతి 15 రోజులకోసారి రెండు దఫాలుగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపేసింది.

ఖర్చులను ఉత్తేజపరిచి.. దాని ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని మార్చినట్లుగా తెలిపింది. ఇకపై 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆర్థిక వ్యవస్థను బలపరచడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు కూడా చెబుతున్నారు. ఉద్యోగులకు సకాలంలో నగదు అందితే నెల ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరి.. ఆపై తగ్గిపోకుండా నెల మొత్తం స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నెలాఖరులో ఖర్చుల విషయంలో తరచుగా ఇబ్బంది పడే మధ్యతరగతి ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు కూడా స్వాగతించారు. పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు, రోజువారీ గృహ ఖర్చులను ఈ విధానం ద్వారా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ప్రతి రెండు వారాలకు క్రమం తప్పకుండా నిధులు అందడం వల్ల స్వల్పకాలిక రుణాలపై ఆధారపడటం కూడా తగ్గుతుందని అంటున్నారు.

ఈ మార్పు చిన్న వ్యాపారాలకు, చిల్లర వ్యాపారులకు కూడా ప్రయోజనం చేకూర్చగలదని ఆర్థికవేత్తలు అంటున్నారు. నెల ప్రారంభంలో ఖర్చులో ఆకస్మిక పెరుగుదల.. ఆ తర్వాత మందగమనం ఉండటానికి బదులుగా సమతుల్యంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ నమూనా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే అమలవుతోంది. ఇది విజయవంతమైతే ఇతర ఆర్థిక వ్యవస్థలకు ఇది ఒక నమూనాగా ఉపయోగపడగలదని నిపుణులు భావిస్తున్నారు.