Reading Time: 2 minutes
Paapam Pratap Movie Review Tiruveer Etv Win

పాపం ప్రతాప్ రివ్యూ:
భిన్నమైన సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోలలో తిరువీర్ ఒకరు. తాజాగా ఆయన ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు దుర్గా నరేష్ డైరెక్ట్ చేశారు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, దర్శకుడు దేవి ప్రసాద్, రాశి, అవసరాల శ్రీనివాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

పాపం ప్రతాప్ కథ:
గోదావరి జిల్లాల్లోని ఒక లంక గ్రామంలో వీరయ్య (అజయ్ ఘోష్) పురుగుమందుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని కొడుకైన ప్రతాప్ (తిరువీర్) చిన్నప్పటి నుంచే తన క్లాస్మేట్ అయిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఎట్టకేలకు ఇద్దరి ఇళ్లలో ఒప్పించి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే, పెళ్లి తర్వాత జరిగే మూడు రోజుల ముచ్చట పూర్తయిన వెంటనే బుజ్జమ్మ పంచాయతీ పెట్టిస్తుంది. తన భర్త రాత్రి పూట ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కొంతవరకు రివీల్ చేసి, భర్తతో సహా అందరికీ అసలు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా షాక్ ఇస్తుంది. అయితే అసలు రాత్రి సమయంలో ప్రతాప్, బుజ్జమ్మను ఏమని ఇబ్బంది పెట్టాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కలిసిందా? అసలు ప్రతాప్ కి ఉన్న సమస్య ఏమిటి? వీర ప్రతాప్, ‘పాపం ప్రతాప్’గా ఎలా అయ్యాడు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
ఈ మధ్యకాలంలో ఒక వింత జబ్బుని ముందే రాసుకుని, దాని చుట్టూ కథ రాసుకోవడం ఎక్కువవుతోంది. ఒక రకంగా ఇది కూడా అలాంటి సినిమానే అని చెప్పవచ్చు. చాలా రేర్ గా, తక్కువ మందికి మాత్రమే ఉన్న ఒక ఆరోగ్య సమస్యను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. దానికి సామాజిక పరిస్థితులను పావుగా వాడుకున్నాడు. వాస్తవానికి ఇప్పుడంటే కొంతవరకు పర్వాలేదు కానీ, ఒకానొక సమయంలో ఊర్లలో పరిస్థితులు ఎలా ఉండేవి అనే విషయం మీద దర్శకుడు చాలా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. భార్యాభర్తల మధ్య ఎన్నైనా జరగొచ్చు, వారు ఏ విషయం మీదైనా దూరమై ఉండవచ్చు, కానీ ఆ విషయాన్ని ఊరి వాళ్లందరూ ఎలా చిలువలు పలువలు చేస్తారు అనే విషయం కొంత రిలేటబుల్ గా అనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న సమస్య ఒకటైతే, అది ఊరి వారికి మరోలా అర్థం కావడం, అది ఒక్కొక్కరి నోట ఒక్కొక్క రకంగా పాకుతూ వెళ్లడం వల్ల ప్రతాప్ ‘పాపం ప్రతాప్’గా ఎలా మారాడు అనేది కొంత నవ్విస్తూనే, కొంత ఎమోషనల్ గా రాసుకున్నాడు దర్శకుడు. అయితే తెరమీద పాత్రలు కామెడీ చేస్తుంటాయి కానీ, ఎందుకో నవ్వు మాత్రం పూర్తిస్థాయిలో తెప్పించలేకపోయాయి. ఆ విషయంలో మాత్రం దర్శకుడు ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి, బహుశా కథను 90స్‌లో నడుస్తున్నట్లుగా రాసుకున్నట్టున్నాడు దర్శకుడు. అయితే అక్కడ కూడా కొన్ని సీన్స్ లాజిక్ కి అందకుండా ఉంటాయి. వాస్తవానికి ఇది చాలా చిన్న పాయింట్, కానీ దాని చుట్టూ రాసుకున్న కథ సినిమాకి ఎక్కువగానే ఉంది కాబట్టి, కొన్ని సీన్స్ ఎందుకో లాగ్ చేసినట్టు, అనవసరంగా రిపీట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

నటన & సాంకేతిక విభాగం
ఇక నటీనటుల విషయానికి వస్తే, ప్రతాప్ పాత్రలో తిరువీర్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండే కాబట్టి, ఎక్కడా తగ్గకుండా సినిమా మొత్తం నడిపించేశాడు. ఇక అజయ్ ఘోష్ కూడా ఎక్కడా తగ్గకుండా తనదైన డామినేషన్ చూపించాడు. రాశి పాత్ర పరిమితంగా ఉన్నంతలో మెప్పించింది. అవసరాల శ్రీనివాస్ కనిపించేది కొన్ని సీన్స్ లో అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. పాయల్ రాధాకృష్ణకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, కథ కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉన్నా, కొన్ని సీన్స్ లో నవ్వించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో తనదైన శైలిలో డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి తగినట్లుగా ఉంది. సంగీత దర్శకుడు తన పాటల్లో మరోసారి మ్యాజిక్ చేశాడు.

ఫైనల్ గా: ఈ ‘పాపం ప్రతాప్’ కొంతవరకు నవ్విస్తాడు.