Reading Time: < 1 minute
Kakinada Fishing Ban From Midnight Rs 5000 Fine And Boat Seizure Till June 14

Fishing Ban: సముద్ర జీవుల సంతానోత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రతి ఏడాది అమలు చేసే వేట నిషేధం ఈ ఏడాది కూడా నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కాకినాడ జిల్లాలో ఈ నిషేధం జూన్ 14 వరకు కొనసాగనున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఐదు మండలాలకు విస్తరించిన 68 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సుమారు 25 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు. వేట నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని వందలాది బోట్లు తీరానికే పరిమితం కానున్నాయి.

Read Also: Amaravati Quantum Valley: సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం.. వేదికగా మారనున్న అమరావతి..

అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో 478 మెకనైజ్డ్ బోట్లు, 3,904 మోటారైజ్డ్ బోట్లు, 386 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. నిషేధ కాలంలో ఇవన్నీ సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లోనే నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుంటున్నారు. వేట నిషేధాన్ని ఉల్లంఘించి సముద్రంలోకి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు బోటును స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశముందని స్పష్టం చేశారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో అర్హ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. సముద్ర సంపద పరిరక్షణ, చేపల వనరుల పెంపు, భవిష్యత్తులో మత్స్యకారులకు మెరుగైన ఆదాయం లక్ష్యంగా ఈ నిషేధాన్ని ప్రతి సంవత్సరం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.