Reading Time: < 1 minute
Us Iran Talks New Round Thursday Tensions Ceasefire Deadline

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గురువారం కొత్త విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉద్దేసిస్తూ కథనాలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య కొత్త చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని అమెరికా అధికారులు తెలిపినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. దాదాపు 21 గంటల పాటు ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరిగాయి.. చివరికి చర్చలు విఫలం కావడంతో ఎవరి దారిన వారు తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చర్చలు విఫలమైతే ఈసారి ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయని ట్రంప్ ముందే హెచ్చరించారు. వార్నింగ్ ఇచ్చినట్లుగానే హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. దీంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.

ఇదిలా ఉంటే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఈనెల 21తో ముగియనుంది. సమయం దగ్గర పడుతుండడంతో పరిస్థితులు మరోసారి టెన్షన్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడువుకు ముందే మరోసారి ఇరాన్-అమెరికాతో చర్చలు జరపాలని టర్కీ, పాకిస్థాన్, ఖతార్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రస్తుతం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ సమయంలోనే శాంతి ఒప్పందం చేసుకోవాలని రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Earthquake: అమెరికాలో భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు