Reading Time: < 1 minute
Srh 200th Match And Abhishek Sharma 100 Match For Sunrisers Hyderabad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్‌ఆర్‌హెచ్ 200వ మ్యాచ్‌ ఆడుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్‌కు డబుల్ సెంచరీ మ్యాచ్. ఇది ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి ఒక ప్రత్యేకమైన సందర్భం. 2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్.. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులు, కొత్త ఆటగాళ్లు వచ్చినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది.

2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ 100వ మ్యాచ్ ఆడింది. అప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఇప్పుడు కూడా కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ అభిషేక్ శర్మ మాత్రమే. ఆ మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తరుఫున అభిషేక్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిషేక్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఓపెనర్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టుకు తన వంతు సహకారం అందిస్తున్నాడు. యువ ఆటగాడిగా ప్రారంభమైన అతని ప్రయాణం.. ఇప్పుడు జట్టులో సీనియర్ పాత్ర దిశగా సాగుతోంది.

Also Read: PBKS vs SRH: టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్‌.. ఇద్దరు స్టార్స్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ 200 మ్యాచ్‌ల ప్రయాణంలో ఎన్నో స్టార్ ప్లేయర్లు వచ్చారు, వెళ్లారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం జట్టుతో తన బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇది అభిషేక్ క్రమశిక్షణకు, ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ స్పెషల్ మ్యాచ్‌లో అభిషేక్ రెచ్చిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉండడం విశేషం. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 5 ఓవర్లకు 84/0గా ఉంది. అభిషేక్ ఊపు చూస్తే ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 300 చేరే అవకాశాలు ఉన్నాయి.