Reading Time: 2 minutes
Ap Govt Plans Strict Social Media Rules For Children Draft Law Under Consideration Says Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నపిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ఉండవల్లి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించి, ఈ అంశంపై విధివిధానాల రూపకల్పనతో పాటు చట్టం తయారీపై చర్చించారు. ఈ సమావేశంలో నారా లోకేష్ తో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక విషయాలను చర్చించారు. 13 సంవత్సరాల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉంచే విధంగా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వయస్సుకు అనుగుణమైన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?

సోషల్ మీడియాలో మహిళలపై అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు కోసం అవసరమైన లీగల్ మెకానిజంను రూపొందించేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలులో ఉన్న విధానాలను పరిశీలించాలని, పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ నుంచి దూరంగా ఉంచే మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. అలాగే సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ రోజున విద్యార్థులకు, ప్రతి ఏడాది నిర్వహించే మెగా పీటీఏ సమావేశాల్లో తల్లిదండ్రులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా మహిళల భద్రతపై స్వయంసహాయ సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వయస్సు నిర్ధారణ కోసం డిజిలాకర్ ఆధారిత ‘ఏజ్ టోకెన్’ విధానాన్ని కూడా పరిశీలించనున్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత కేంద్ర చట్ట పరిధిలో వచ్చే అంశాలపై నివేదికను సమర్పించనున్నారు.

TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

ఈ సమావేశంలో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా తమ విధానాలను వివరించారు. చిన్నపిల్లలను సున్నితమైన కంటెంట్ నుంచి దూరంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అంతేకాక, ఐటీ చట్టంలోని సెక్షన్ 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించే చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.