Reading Time: < 1 minute
Vaibhav Sooryavanshi Tipped As Future Superstar By Graeme Smith After Ipl 2026 Heroics

ఐపీఎల్ 2026 సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్‌లలో వైభవ్ మెరిశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ భారత యువ సంచలనంపై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో ‘సూపర్ స్టార్’ అవుతాడని జోస్యం చెప్పాడు.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అదే ఓవర్లో మరో సిక్సర్ కొట్టి తన దూకుడును చూపించాడు. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ… ఐపీఎల్ 2026 ఎప్పటిలాగే హై స్కోరింగ్ మ్యాచ్‌లతో ప్రారంభమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల ప్రదర్శన చూడటం ఆసక్తికరమే. కానీ ఈ సీజన్ ప్రారంభంలో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతడిలో ఉంది. ఈ టోర్నమెంట్ ముగిసే సమయానికి అతడు నిజమైన సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు’ అని అన్నాడు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా వైభవ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా వంటి టాప్ బౌలర్‌పై తొలి బంతికే సిక్సర్ కొట్టడం అతడి ధైర్యాన్ని, నమ్మకాన్ని చూపుతుందని పేర్కొన్నాడు. ఈ వయసులోనే ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డాడు.