Reading Time: 2 minutes
Nitish Kumar Rajya Sabha Oath Bihar New Chief Minister Announcement

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా సీఎంగా సేవలందించిన నితీష్ కుమార్, ఇప్పుడు తన ముఖ చిత్రాన్ని మార్చుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టేందుకు గురువారం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

READ ALSO: Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

వారసుడిపై ఢిల్లీ నుంచే క్లారిటీ
ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను రేపు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదిలేసి ఇక్కడికి వచ్చాను. రాబోయే మూడు నాలుగు రోజుల్లో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలోనూ ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నానని, మధ్యలో బీహార్‌కు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బీహార్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 14న (అంబేద్కర్ జయంతి) సందర్భంగా ఎన్డీయే (NDA) కూటమి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. నితీష్ కుమార్ స్థానంలో బీజేపీకి చెందిన నేత ముఖ్యమంత్రి అవుతారా లేదా జేడీయూ నుంచే మరొకరికి అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

నితీష్ కుమార్ మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన మార్చి 30న బీహార్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయనతో శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి వచ్చిన నితీష్ కుమార్‌కు జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా సహా పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ రంగప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ స్పందించలేదు. ఆ విషయంపై పార్టీ నేతలే సమాధానం ఇస్తారని దాటవేశారు. తాజాగా నితీష్ కుమార్ ఢిల్లీకి మకాం మార్చడంతో బీహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!