Reading Time: 2 minutes
Adilabad Congress Internal War Jupally Krishna Rao Sudarshan Reddy Clash

OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత, కొత్త గ్రూప్ వార్ కాంగ్రెస్‌ పార్టీకి గుదిబండగా మారిపోతోంది. ఏళ్లుగా జెండా మోసిన వారిని కాదని… జంపింగ్‌ జపాంగ్స్‌కు పదవులు కట్టబెడుతున్నారంటూ రగడ మొదలైంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్‌ పోస్టుల్లో సింహభాగం కొత్త నేతల అనుచరులే ఎగరేసుకుని పోతున్నారంటూ అంతర్గత పోరు జరుగుతోంది. ఏకంగా పీసీసీ చీఫ్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం కొంతమంది నేతలు అసహనం వెళ్ళగక్కారట. ఆసిఫాబాద్‌లో ఓనేత వర్గం నారాజ్‌లో ఉండగా మంచిర్యాలజిల్లాలో సైతం ఓ ఎమ్మెల్యే తన అసహనం వెళ్ళగక్కారు. నిర్మల్ జిల్లాలో సైతం ఇంకో నేత పార్టీలు మారి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారట.

READ ALSO: Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

మరోవైపు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్‌ మంత్రిగా ఉన్నారు జూపల్లి కృష్ణారావు. అయితే కొంతకాలంగా ఆయన్ని కాదని… అన్ని వ్యవహారాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వేలు పెడుతున్నారని, దాంతో… ఇన్ఛార్జ్‌ మినిస్టర్‌ ప్రాధాన్యం తగ్గిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలన్నీ నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే సాగడం ఇన్ఛార్జ్‌ మంత్రికి మింగుడు పడ్డం లేదట. అలాంటప్పుడు ఆయనకు ఆ బాధ్యతలు ఎందుకు ఇచ్చినట్టన్న ప్రశ్నలు వస్తున్నాయి. సలహాదారు.. తన సామాజికవర్గానికి చెందిన నాయకులు కొందరు ఇచ్చిన ప్రతిపాదనల్ని అమలు చేస్తూ.. పార్టీ సీనియర్స్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఫైనల్‌గా.. సలహాదారు చెప్పిన వారికే టికెట్లు రావడం, రెడ్డి సామాజికవర్గం నాయకుల ప్రతిపాదనలు మాత్రమే ఓకే కావడంతో మిగతా వాళ్లు నొచ్చుకున్నారట. పైగా కొన్ని చోట్ల పార్టీ సీనియర్లు పట్టుబడితే టికెట్లు ఇచ్చినా.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్‌ తన అనుచరులను గెలిపించుకోవడం కోసం పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అయ్యారనే టాక్ కాంగ్రెస్‌లో ఉంది.

ఆదిలాబాద్‌లో ఒకరు, నిర్మల్‌లో మరొకరు తన సామాజికవర్గానికి చెందిన నాయకుల్నే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే.. జిల్లా స్థాయిలో నామినెటెడ్ పోస్టులు సైతం అగ్రవర్ణాలకే తప్ప బడుగు బలహీన వర్గాలకు, అందులో పార్టీ సీనియర్లకు అస్సలు ఇవ్వడం లేదని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇన్ఛార్జ్‌ మంత్రి, సలహాదారు మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాల వల్లే క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాలు కోల్పోవాల్సి వచ్చిందనే వారు సైతం ఉన్నారు పార్టీలో. కట్టర్ కాంగ్రెస్ వాదులను విస్మరించడం సైతం అదే కోవలోకి వస్తుందంటున్నారు.

జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల నుంచి సీనియర్స్‌ లేదా ఉన్నత పదవుల్లో ఉన్న వారంతా తాము తమ వర్గాల కోసం పనిచేస్తున్నారే తప్ప.. పార్టీ కోసం, పార్టీ జెండా పట్టుకుని కేసుల పాలైన వారిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఏపని కావాలన్నా సలహాదారునే కలవాలన్న ఆదేశాలు సైతం ఇన్ఛార్జ్‌ మంత్రిని అసహనానికి గురి చేస్తున్నాయట. జూపల్లి కూడా మరో మార్గం లేక బాధను దిగమింగుకుంటున్నట్టు చెబుతోంది ఆయన వర్గం. యూనివర్శిటీ కావాలాన్నా… ఎయిర్ పోర్టు , పారిశ్రామిక కారిడార్ భూసేకరణ… ఇలా విషయం ఏదైనాసరే… అధికారులు, నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జ్‌ మంత్రిని కాకుండా సలహాదారుడినే కలవాలంటూ పై నుంచి ఆదేశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటినీ మౌనంగా గమనిస్తున్న జూపల్లి కృష్ణారావు సమయం కోసం వేచిచూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో సుదర్శన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మధ్య గ్యాప్‌ అంతకంతకూ పెరుగుతోందని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే కష్టమన్న అభిప్రాయం బలపడుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో.

READ ALSO: Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..