
OTR: పొలిటికల్ పిడుగులు పడుతున్నా.. పెదవి విప్పరు. ఆరోపణల ఉరుములు ఉరుముతున్నా.. అణు మాత్రం కూడా స్పందించరు. అసలు అనేది నన్ను కాదుకదా… అన్న ధోరణి పెరిగిపోతోంది. తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్ చేసుకోవడం లేదా? అందుకే ప్రతిపక్షం అనేది నన్నుకాదుకదా…. నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి కౌంటర్స్ వేయమని మంత్రులకు ముల్లుగర్రలు పెట్టి పొడిచి చెప్పాల్నా? తెలంగాణ కేబినెట్‌లో అసలేం జరుగుతోంది?
సమ్మర్ సెగలతో పాటే తెలంగాణలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. గడిచిన వారం రోజులుగా ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర మంత్రులను గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఒక రోజు భూములని, ఇంకో రోజు ప్రాజెక్టులను ముందు పెట్టి పొలిటికల్ హీట్ పెంచుతోంది. కానీ, గవర్నమెంట్ వైపు నుంచి వాటిని సరైన కౌంటర్స్ ఉండటం లేదు. ఇదంతా చూస్తున్న చాలా మందికి కొన్ని కొత్త డౌట్స్ వస్తున్నాయట. ప్రజల్లో ప్రభుత్వాన్ని పలచన చేసే ప్రయత్నం జరుగుతున్నా.. అధికారపక్షం ఎందుకు మౌనంగా ఉంది?, ఎవర్ని విమర్శిస్తే వాళ్లే సమాధానం చెప్పుకోవాలా..? లాంటి సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక మంత్రిని ప్రతిపక్షం టార్గెట్ చేస్తే.. క్యాబినెట్లో ఉన్న మిగిలిన మంత్రులు ఎవరూ స్పందించే పరిస్థితి లేదు. అందుకే అనుమానాలు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఒకరిద్దరు మంత్రులే లక్ష్యంగా ప్రతిపక్షం పావులు కదుపుతోంది.
Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?
కానీ అధికార పక్ష నుంచి దీటుగా సమాధానం రావడం లేదు. ప్రతిపక్షం చేసే ఆరోపణలు వాస్తవమా, అవాస్తవమా అన్న సంగతి పక్కన పెడితే.. కనీసం దాని మీద ఇట్నుంచి రియాక్ట్ అయితేనే కదా.. ప్రజలకు వాస్తవాలు తెలిసేది అన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. పార్టీ నేతలు ఒకరిద్దరు స్పందిస్తున్నా.. అది ప్రతిపక్ష నాయకుల స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో అధికార పక్షం చెప్పే వాదన ప్రాచుర్యంలోకి రావడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ప్రతిపక్షం పావులు కదుపుతోంది.
ఈ ముగ్గురు నేతలు పూర్తిగా కేరళ ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. అయినాసరే.. ప్రతిపక్ష ఆరోపణల మీద మిగిలిన మంత్రులు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా ప్రతిపక్షం వారం రోజుల నుంచి ప్రభుత్వంపై నిందలు మోపుతుంటే.. మళ్లీ అదే మంత్రులు వచ్చి చెప్పుకునేదాకా ఇక్కడ రియాక్షన్ లేదు. సాధారణంగా క్యాబినెట్లో ఒక మంత్రిని టార్గెట్ చేస్తున్నారంటే అది పూర్తిగా ప్రభుత్వంపై యుద్ధం చేయడం లాంటిదే. కానీ ఆ విషయం నాదాక రాదులే అని చాలామంది మినిస్టర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
గతంలో ప్రభుత్వంపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా.. క్యాబినెట్ నుంచి పొన్నం ప్రభాకర్. కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు. కానీ… కొన్ని సందర్భాల్లో ఆయా మంత్రులకు అండగా నిలబడలేదన్న కారణంతో మాట్లాడే వాళ్లు కూడా తగ్గించేశారన్న అభిప్రాయం ఉంది. దీంతో…ఇప్పటికైనా ప్రభుత్వం మీద గాని, పార్టీ మీద గాని ఆరోపణలు వస్తే వెంటనే స్పందించేందుకు పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మంత్రులు గాంధీభవన్ కి వచ్చి మీడియా సమావేశాలు పెట్టడమే మర్చిపోయారు.
ఇటీవల జూపల్లి మాత్రం కృష్ణా జలాల వివాదంపై మాట్లాడేందుకు వచ్చారు. మిగిలిన వాళ్ళు గాంధీభవన్ ని వదిలేసి చాలా రోజులైనట్టు కనపడుతోంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అయినా జోక్యం చేసుకుని మంత్రులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీలోని సీనియర్ నేతలను ఇప్పటికైనా రంగంలోకి దించాలని అంటున్నారు. కేవలం ప్రతిపక్షం ఆరోపించిందనే కాకుండా.. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పుకోవడానికి కూడా గాంధీభవన్ లో మంత్రులు మీడియా సమావేశాలు పెడితే తప్పేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. ఇప్పటికైనా మంత్రులు, పార్టీ నాయకత్వం మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. అటు Pcc చీఫ్ మహేష్ గౌడ్ కూడా జిల్లా పర్యటనలు శ్రీకారం చుట్టారు. ఐతే మంత్రులు… సీనియర్ నేతలు అలెర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందన్నది హస్తం నేతల మాట. ప్రభుత్వం మీద జరిగే దాడిని ఖండించడానికి MLc అద్దంకి దయాకర్, వెంకట్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ చామల కిరణ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తమకు సంబంధం లేదన్నట్టు ఉంటున్నారన్నది కాంగ్రెస్ వాయిస్.