Reading Time: 2 minutes

చట్ట సభలకు రాబోయే ఎన్నికలు తప్పని సరిగా మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.కొండాపూర్‌లోని శిల్పా పార్క్ అపార్ట్‌మెంట్స్ నివాసితులు బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని, రాబోయే 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఇది పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు.దేశవ్యాప్తంగా త్వరలో డీ-లిమిటేషన్ ప్రక్రియ జరగనుందన్నారు.

అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ అనేది పూర్తిగా ఎలక్టోరల్ ప్రాసెస్‌లో భాగమని ఆయన తెలిపారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడానికి చేపట్టే ప్రక్రియ మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానమని ఆయన వివరించారు. సర్ ప్రక్రియ గతంలో 1956, 1965, 1970, 1980, 1990లలో జరిగిందని, చివరిసారిగా 2002లో జరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటర్లు వేరే ప్రాంతానికి మారడం, మరణించడం వంటి కారణాలతో ఓటర్ లిస్టులో లోపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను సరిచేయడానికి ఎన్నికల సంఘం ఫార్మ్-6, ఫార్మ్-7, ఫార్మ్-8లను ప్రవేశపెట్టిందని, వీటి ద్వారా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు జరుగుతాయని అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు.

మరోవైపు హైదరాబాద్ పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండడం వంటి అనుమానాస్పద అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించి, స్థానికంగా మజ్లీస్ మద్దతుతో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందడం చూస్తూనే ఉన్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలి. రెండు చోట్ల ఓటు ఉండటం చట్ట విరుద్దమని, అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించడం తప్పనిసరి అని రాంచందర్ రావు అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని రాంచందర్ రావు ఆయన తెలిపారు.

–==–