Reading Time: < 1 minute
Ys Jagan Announces Padayatra Slams Chandrababu Over Amaravati Capital Issue

YS Jagan Padayatra: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు.. వచ్చే సంవత్సరం తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలతో నేరుగా మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు “సినిమా చూపిస్తాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఆపివేసిందని జగన్ ఆరోపించారు. ప్రజల తరఫున వైసీపీ శ్రేణులు గట్టిగా పోరాటం చేస్తున్నాయని, వారి కృషిపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే ఐదేళ్ల కాలంలో సగం గడిచిపోయిందని, అయినప్పటికీ రాజధాని అంశంలో స్పష్టమైన పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు.

Read Also: Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అమరావతిలో ఒక ఎకరానికి కనీస సదుపాయాలకే రూ.2 కోట్లు ఖర్చవుతుందని, మొదటి 50 వేల ఎకరాలకే రూ.1 లక్ష కోట్లు అవసరమవుతాయని అన్నారు. మరిన్ని ఎకరాలు అభివృద్ధి చేయాలంటే మొత్తం ఖర్చు లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. ఇంత భారీ వ్యయంతో రాజధాని నిర్మాణం సాధ్యమా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి తాము ప్రత్యామ్నాయ ప్రణాళికలను సూచించామని జగన్ వివరించారు. ప్లాన్-A కింద విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని గుర్తు చేశారు. ప్లాన్-B కింద మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని MAVIGUN గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సూచించామని తెలిపారు.

అమరావతిలో నిర్మించాల్సిన భవనాలను ఈ గ్రోత్ కారిడార్‌లో నిర్మిస్తే తక్కువ ఖర్చుతో, వేగంగా రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మొత్తం రూ.2 లక్షల కోట్ల భారాన్ని రాష్ట్రంపై వేయకుండా, దాని 10 శాతం ఖర్చుతోనే అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ప్రత్యామ్నాయాలను పక్కనబెట్టి చంద్రబాబు అమరావతిపైనే పట్టుబడుతున్నారని విమర్శించారు. దీనికి కారణం అమరావతి పేరుతో కాంట్రాక్టులు, కమిషన్లు సంపాదించడమేనని ఆరోపించారు. అమరావతి దోపిడీ, అవినీతికి కేంద్రంగా మారిందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.