Reading Time: < 1 minute
Virender Sehwag Slams Kkr Captain Ajinkya Rahane Over Strike Rate Remarks In Ipl 2026

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి అనంతరం కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు చేసిన వారిపై జింక్స్ ఫైర్ అయ్యాడు. తన సక్సెస్ చూడలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, తాను క్రికెట్ ఆడటం కొందరికి నచ్చడం లేదంటూ మండిపడ్డాడు. ఈ వ్యాఖ్యలు అభిమానులను మాత్రమే కాకుండా క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.

అజింక్య రహానే వ్యాఖ్యలపై తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘ఒక ఆటగాడికి ప్రశంసలు, విమర్శలు రెండూ సహజం. అన్నింటికీ తటస్థంగా ఉండాలి. ప్రతీ విమర్శకు స్పందించడం అవసరం లేదు. కెప్టెన్‌గా మరింత హుందా తనంతో వ్యవహరించాలి. రహానె కెప్టెన్ కాబట్టి గ్రీన్ గురించి ప్రెస్ మీట్‌లో అడిగారు. క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి అనే అతడి సమాధానం బాగుంది. స్ట్రైక్ రేట్‌పై వచ్చిన ప్రశ్నకు రహానే ఇచ్చిన సమాధానంలో స్థిరత్వం లోపించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు’ అని వీరూ చురకలు వేశాడు.

Also Read: MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

అలానే ప్రముఖులు విమర్శలను ఎలా ఎదుర్కొన్నారో ఉదాహరణలతో సెహ్వాగ్ వివరించాడు.’సచిన్‌ టెండూల్కర్, అమితాబ్‌ బచ్చన్‌ వంటి మహానుభావులు విమర్శలపై ఎప్పుడూ మౌనం పాటించారు. విమర్శలను హుందాగా ఎదుర్కొన్నారు. తమ పనితోనే సమాధానం ఇచ్చారు. ఓ సమయంలో టెండూల్కర్‌ ఫామ్‌ లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో ఓ పత్రిక ఎండూల్కర్‌ అని విమర్శించినా ఆయన ప్రతిస్పందించలేదు. తన ఆటతోనే విమర్శకుల నోరు మూయించాడు. వివాదాలకు వెళ్లడం కన్నా మైదానంలో మంచి ప్రదర్శన చేయడం ఉత్తమం. ఒక సెంచరీ కొడితే విమర్శలు అన్నీ ఆగిపోతాయి’ అంటూ రహానేకు సెహ్వాగ్ సూచనలు చేశాడు.