Reading Time: 4 minutes

ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో టెస్టుల దందా!.. పేషెంట్లను భయపెట్టి లక్షలు గుంజుతున్నరు

Caption of Image.

ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్లు తగ్గకపోయినా తగ్గినట్టు, షుగర్ లేకపోయినా ఉన్నట్టు ఫేక్ రిపోర్టుల సృష్టి.. ఇటీవలే కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డ రిపోర్టుల మ్యానిపులేషన్ ఫిజియోథెరపీతో నయమయ్యే మోకాళ్ల నొప్పులకు సర్జరీలు సాధారణ జ్వరంతో వెళ్లినా ఐసీయూల్లో చేర్చి జనం జేబులకు చిల్లులు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌పై కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, హాస్పిటల్స్ దోపిడీకి చెక్ పెట్టాలని ప్రజల వినతి

ప్లేట్‌‌లెట్ల సంఖ్య మార్చేశారు.. 

ఇటీవల హైదరాబాద్​ కూకట్‌‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో డెంగ్యూ జ్వరంతో చేరిన 66 ఏండ్ల వృద్ధురాలికి రక్తం పరీక్షలు చేశారు. మొదట ల్యాబ్‌‌లోని టెక్నీషియన్ ​వద్ద ట్యాబ్ స్క్రీన్‌‌పై ప్లేట్‌‌ లెట్ కౌంట్ 1.26 లక్షలుగా కనిపించింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ రిపోర్ట్‌‌ను ఫోన్‌‌లో ఫొటో తీసి పెట్టుకున్నారు. కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన డాక్టర్.. ప్లేట్‌‌లెట్ల సంఖ్య కేవలం 90 వేలు మాత్రమే ఉందని, మరో వారంపాటు అడ్మిట్ అయి ఉండాలని చెప్పారు. పేషెంట్ బంధువులు మళ్లీ ట్యాబ్‌‌లో చూస్తే అప్పటికే 1.26 లక్షల నుంచి 90 వేలకు నంబర్ మారిపోయింది. కొద్ది నిమిషాల్లోనే డిజిటల్ సిస్టమ్‌‌లో ప్లేట్‌‌ లెట్ల సంఖ్య ఎలా మారిపోయిందో చెప్పాలంటూ మొదటి ఫొటో ఆధారంగా కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీశారు. ల్యాబ్ రిపోర్టుల గోల్‌‌మాల్ అడ్డంగా దొరికిపోవడంతో భయపడిన హాస్పిటల్ యాజమాన్యం, అంతవరకు మరో వారం ఉండాలని చెప్పిన రోగిని అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసి పంపించేశారు. సదరు రోగి బంధువులు దీనిని ఆధారాలతో సహా వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని, హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

సర్జరీ అన్నారు.. ఫిజియోథెరపీతో తగ్గింది.. 

ఓ 45 ఏండ్ల వ్యక్తి ఎడమ మోకాలి నొప్పితో 6 నెలల కింద సికింద్రాబాద్‌‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్​హాస్పిటల్‌‌కు వెళ్లాడు. ఎక్స్​రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌‌లు తీయించాక ఏసీఎల్, ఎంసీఎల్​, ఎల్​సీఎల్​లో సమస్య ఉందని, ఏసీఎల్​(ఆంటీరియర్​ క్రూసియేట్​ లిగమెంట్​) డ్యామేజీ (టియర్​) అయిందని, తప్పనిసరిగా సర్జరీ చేయాలని అక్కడి డాక్టర్​ చెప్పారు. సర్జరీ ఎస్టిమేషన్ ​కోసం బిల్లింగ్​ డిపార్ట్​మెంట్​కు వెళ్లి అడిగితే 2.5లక్షలు అవుతుందన్నారు. 

దీంతో సదరు వ్యక్తి ఆ రిపోర్ట్‌‌తో వేరే హాస్పిటల్‌‌కు వెళ్తే ఎలాంటి సర్జరీ అవసరం లేదని, మజిల్​ స్ట్రెంతెనింగ్​ఎక్సర్​ సైజ్‌‌లు చేస్తే సరిపోతుందని చెప్పారు. దీంతో ఫిజియోథెరపిస్ట్​ దగ్గరికి వారం రోజులు వెళ్లే సరికి నొప్పి సగానికి సగం తగ్గిపోయింది. ఆరు నెలలు తిరిగే సరికి మామూలుగా నడవగలుగుతున్నాడు.

హైదరాబాద్, వెలుగు: రోగాన్ని నయం చేయాల్సిన ఆసుపత్రులు దోపిడీ కేంద్రాలుగా మారుతున్నాయి. ‘వైద్యో నారాయణో హరి’ అన్న సూక్తిని పాతరేసి.. రోగుల భయాన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. టెస్టు రిపోర్టులను తమకు కావాల్సినట్లు మార్చుకుంటూ..  లేని రోగాలను ఉన్నట్లు చూపిస్తూ.. లక్షల్లో దండుకుంటున్నాయి. 

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో.. ప్రైవేట్ మాఫియా దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్తంలో ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్ల సంఖ్య సరిపడా ఉన్నా, తగ్గినట్లు, ఒంట్లో షుగర్ లేకపోయినా ఉన్నట్లు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్లలో డేటా మార్చి తప్పుడు రిపోర్టులు సృష్టిస్తున్నారు. ఐసీయూలు, వెంటిలేటర్లు, అనవసర సర్జరీల పేరుతో బాధితులను దోచుకుంటున్నారు. సాధారణ జ్వరం అని వెళ్తే చాలు.. పేషెంట్ ప్రాణాల మీదికి వచ్చిందంటూ ల్యాబ్ రిపోర్టులను ట్యాంపర్ చేసి, భయపెట్టి లక్షలు గుంజుతున్నారు. 

టార్గెట్లు పెట్టుకొని మరీ దోపిడీ.. 

ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు డాక్టర్లపై పెడుతున్న టార్గెట్లే ఈ దోపిడీకి ప్రధాన కారణమని తెలుస్తున్నది. హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓపీ, బెడ్ల సంఖ్యను బట్టి.. ప్రతి నెలా టార్గెట్లు ఉంటున్నాయి. డాక్టర్లకు నెలనెలా ఇన్ని ల్యాబ్ టెస్టులు రాయాలని, ఇన్ని సర్జరీలు చేయాలని లక్ష్యం విధిస్తున్నారు.  లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూనే టెస్టులు, సర్జరీల్లో కమీషన్లు ఇస్తుండడంతో పలువురు డాక్టర్లు టార్గెట్లు చేరుకోవడం కోసం ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారా ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాఫ్ట్‌‌వేర్లలో కోడింగ్ మార్పించి, రిపోర్ట్స్‌‌ను వాళ్లకు అనుకూలంగా తిరగరాయిస్తున్నారు. కొన్నిచోట్ల అర్హత ఉన్న పాథాలజిస్ట్ సంతకం కూడా లేకుండానే ఈ ఫేక్ రిపోర్టులను పేషెంట్ల చేతిలో పెడుతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా సర్జరీలు చేయాలంటూ.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్లు, ల్యాబ్‌‌లు, ఫార్మసీలు ఒక నెట్‌‌ వర్క్‌‌గా ఏర్పడి పేషెంట్లను నిలువు దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

సరిపడాఉన్నా.. తగ్గినట్టు చూపుతూ

ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో ప్లేట్‌‌లెట్ల పేరుతో నడుస్తున్న దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. సాఫ్ట్‌‌ వేర్‌‌‌‌లో డేటాను మార్చి ప్లేట్‌‌లెట్లు పడిపోతున్నాయని, వెంటనే ఐసీయూలో చేర్చకపోతే ప్రాణాలకే ప్రమాదమని కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు. నిజానికి.. రక్తంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్‌‌లెట్లు ఉంటాయి. లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఉంటే అది మైల్డ్ థ్రాంబోసైటోపేనియా అంటారు. ఇది ఎంతమాత్రం ప్రమాదకరం కాదు. ఇంట్లోనే ఉంటూ ఫ్లూయిడ్స్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ రక్తంలో 50 వేల నుంచి 90 వేల వరకు ఉన్నా సరే.. అది ఎమర్జెన్సీ కిందికి రాదు. 

డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే కోలుకోవచ్చు. ప్లేట్‌‌లెట్లు 20 వేల కంటే తగ్గి, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, నల్లటి విరోచనాలు కావడంలాంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడే అది ఎమర్జెన్సీ కిందకు వస్తుంది. అప్పుడే ప్లేట్‌‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం జనరల్​ వార్డులో కోలుకునే పేషెంట్‌‌ను ఐసీయూలోకి మార్చి వేల రూపాయల బెడ్ చార్జీలు, ఎస్‌‌డీపీ, ఆర్‌‌డీపీ ప్లేట్‌‌లెట్ బ్యాగులను అనవసరంగా ఎక్కిస్తూ, రోజుకు నాలుగైదు సార్లు సీబీసీ బ్లడ్ టెస్టులు, ప్లేట్‌‌ లెట్ బూస్టర్ ఇంజెక్షన్ల పేరుతో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పిండుకుంటున్నారు.

లేని షుగర్లు, నొప్పులకు అనవసరపు కోతలు 

సాధారణంగా చేసే బ్లడ్ టెస్టుల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ అవకతవకలకు పాల్పడుతున్నాయి. అసలు షుగర్ లేని రోగులకు కూడా బ్లడ్ టెస్టు రిపోర్టులలో గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫేక్ రిపోర్టులు సృష్టిస్తున్నారు. దీంతో తాము మధుమేహ బాధితులమని భయపడి రోగులు జీవితాంతం వాడాల్సిన మందుల బారిన పడుతున్నారు.  

క్రమం తప్పకుండా ల్యాబ్ టెస్టుల పేరుతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, వయస్సు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులను కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు. కేవలం చిన్నపాటి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, ఆహార అలవాట్లతో నయమయ్యే సమస్యలకు కూడా వెంటనే మోకాళ్ల మార్పిడి  సర్జరీలు చేయాలని భయపెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ,హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు, కనీసం అవసరం లేకపోయినా కోతలు కోసి లక్షల రూపాయల క్లెయిమ్‌‌లు చేసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరం, గ్యాస్ట్రిక్ సమస్యతో ఎమర్జెన్సీ డిపార్ట్‌‌మెంట్‌‌కు వచ్చే రోగులకు కూడా వెంటనే వెంటిలేటర్లు, ఐసీయూలు కేటాయించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.  

వైద్యాధికారుల పర్యవేక్షణ ఏదీ?

ప్రైవేట్ హాస్పిటళ్లు ఈ స్థాయిలో బరితెగించి దోపిడీకి పాల్పడుతున్నప్పటికీ.. వాటిని కంట్రోల్ చేయాల్సిన హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌‌పై నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన డీఎంహెచ్‌‌వోలు తమ ఆఫీసులకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే.. 80 శాతం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో మాత్రం ఆఫీసుల నుంచి కదలట్లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. 

ప్రస్తుతం అనుకున్న స్థాయిలో కాకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ విజృంభణ ప్రారంభమైంది. రాష్ట్రంలో  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికీ.. ఏ ఒక్క ప్రైవేట్ ల్యాబ్, హాస్పిటల్‌‌పై  ఆకస్మిక తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ల్యాబ్ ఆడిట్లు చేయకపోవడం వల్ల ప్రైవేట్ నిర్వాహకులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ యాక్ట్ కింద హాస్పిటల్స్‌‌ను తనిఖీ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో ఊగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చర్యలు తీసుకుంటే తప్ప దోపిడీ ఆగదు.. 

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో బ్లడ్ టెస్టుల ధరలను, బెడ్ చార్జీలను ప్రభుత్వం తక్షణమే నియంత్రించి, బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాలో డీఎంహెచ్‌‌వో ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్‌‌ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి, ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ సాఫ్ట్‌‌వేర్లను, ఆడిట్ లాగ్స్‌‌ను ఆకస్మిక తనిఖీ చేయాలి. 

ల్యాబ్ రిపోర్టుల గోల్‌‌మాల్ కంప్లైంట్స్‌‌పై  విచారణ జరిపి హాస్పిటల్స్ లైసెన్సులను రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. హాస్పిటల్స్ దోపిడీపై ఫిర్యాదు చేయడానికి బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌‌ లైన్ నంబర్, వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 

పేషెంట్లు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి..

ప్రభుత్వ చర్యలతో పాటు  ప్రజలు కూడా డెంగ్యూ, ఇతర వ్యాధుల విషయంలో అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్పే ప్లేట్‌‌లెట్ కౌంట్, షుగర్ రిపోర్టులపై అనుమానం వస్తే వెంటనే బయటి ఎన్‌‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ఇండిపెండెంట్ ల్యాబ్స్‌‌లో క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్లేట్‌‌లెట్లు 50 వేల పైన ఉన్నంత వరకు అనవసరంగా భయపడకుండా.. ఐసీయూలో చేరకముందే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలంటున్నారు. ప్రింటెడ్ ల్యాబ్ రిపోర్టులపై క్వాలిఫైడ్ పాథాలజిస్ట్ సంతకం ఉందో లేదో సరిచూసుకోవాలని, ప్రతి చిన్న మార్పును గమనిస్తూ బిల్లులు, రిపోర్టుల ఆధారాలను ఫోన్లలో భద్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ లోపమైతే.. గుండె సమస్య అని చెప్పారు

నీరసంగా ఉండడం, కాస్త నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుండడంతో ఒక వ్యక్తి ఇటీవలే ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లడ్ టెస్టులు, ఈసీజీ, 2 డీ ఎకో లాంటి టెస్టులు చేసి గుండె సమస్య ఉందని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అనుమానం వచ్చిన పేషెంట్‌‌‌‌‌‌‌‌ మరో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సెకండ్ ఓపీనియన్ తీసుకోగా.. గుండె పనితీరు బాగానే ఉందని, విటమిన్ బీ12 లోపం వల్లే ఆయాసం, కండ్లు తిరగడంలాంటి సమస్యలు వస్తున్నాయని తేల్చారు. దీంతో ఇంత చిన్న సమస్యకు మొదటి డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలని చెప్పాడేంటి అని పేషెంట్, బంధువులు ఆశ్చర్యపోయారు.

©️ VIL Media Pvt Ltd.