
- లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు
- అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రముఖులు
- రేపు అధికారిక సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, చార్మినార్, వెలుగు: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో చివరి ఘట్టమైన ఓల్డ్ సిటీ బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. గత నెల 16న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన మూడు వారాలుగా ఘనంగా కొనసాగుతుండగా, ఆదివారం జరిగే ఓల్డ్‌సిటీ బోనాల వేడుకలతో అధికారికంగా ముగుస్తాయి. ఆది, సోమవారాల్లో నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ అధికారిక సెలవు దినం ప్రకటించింది. ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం అనంతరం బోనాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. నగరంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారు, హరిబౌలి అక్కన్న మాదన్న, కోవబేటా బంగారు మైసమ్మ, రాంబక్షిబండ బంగారు మైసమ్మ, బేటా చందూలాల్ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపురా మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ, సుల్తాన్ షాహీ జంగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చాంద్రయణగుట్ట బంగారు మైసమ్మ, కుమ్మర్ వాడీ కనకదుర్గ తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు కొనసాగనుంది. ఈ నెల 13న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ ప్రతినిధులు
బోనాల సందర్భంగా ఆదివారం ప్రభుత్వం తరఫున ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, భేలా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కార్వాన్ దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి దామోదర రాజనర్సింహ, సుల్తాన్‌షాహి శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న అమ్మవారికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంబర్‌పేట శ్రీ మహంకాళి అమ్మవారికి మంత్రి సీతక్క, సబ్జీ మండి శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాంబక్షబండ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ అమ్మవారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గౌలిపూర శ్రీ మహంకాళి అమ్మవారికి మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.