Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. పిఆర్సీ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుత పిఆర్సీ కమిటీ గడువు మరో ఐదు రోజుల్లో (31 మార్చి)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు క మిటీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పిఆర్సీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త పిఆర్సీ నివేదిక ఇంకా  ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్నా పిఆర్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు. మళ్లీ ఎక్స్‌టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని రెండు రోజుల క్రితం బిఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం మరోసారి పిఆర్సీ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.