
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యం, వైద్యం ప్రభుత్వానికి ప్రాధ్యానతా అంశాలు అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రయివేట్ ఆసుపత్రులు మూతపడున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభు త్వం చేసిన పనులకు వారసత్వంగా వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని, వాటిని మోస్తూనే పరిమితిని రూ.5లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.627 కోట్లు పాత బకాయిలు ఉన్నాయని సిఎం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.2,408 కోట్ల చెల్లించగా, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కో ట్లు, ప్రయివేట్ ఆసుపత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని, ప్రస్తుతం ఉన్న బకాయిలు కేవలం రూ.727 కోట్లు మాత్రమేనని,
బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నామని, ఇవి గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే అని సిఎం పేర్కొన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయని, కొంత మంది ఈ సహాయ నిధిని దుర్వినియోగం చేశారని, వారిపై కేసులు కూడా పెట్టిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, దీంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని సిఎం వివరించారు. ఇప్పటికే సిఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 2,046 కోట్లు లబ్దిదారులకు ఇచ్చామని, ఆరోగ్యశ్రీ సుమారు రూ.2,400 కోట్లతో కలిపి ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో రెండు పథకాలకు రూ.4,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం వెల్లడించారు.
రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేదని, ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం రోగులు వెళితే అక్కడ నాణ్యమయిన వైద్యులు ఉండటం లేదని తెలిపారు. దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసే దిశగా ఆలోచిస్తున్నామని, ఆరోగ్యశ్రీతో పాటు సిఎం రిలీఫ్ ఫండ్‌ను ఈ ఆసుపత్రులకు ఇస్తామని సిఎం ప్రకటించారు. ఆసుపత్రుల్లో పనిచేసే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ఆసుపత్రుల నిర్వహణ, రోగుల వైద్యం చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించామని, ఈ సమస్య పరిష్కారానికి ఆసుపత్రుల నిర్వహణకు గ్రూప్ 1 అధికారిని నియమించడంపై చర్చిస్తున్నామని, దీంతో నిర్వాహణ, వైద్య సేవలు వేరు వేరుగా ఉంటాయని సిఎం చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ కుటుంబ బీమాతో రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా కల్పించబోతున్నామని, ఇందిరమ్మ బీమాతో, కుటుంబానికి ధీమా ఉంటుందని సిఎం పేర్కొన్నారు.
విదేశాల్లోని రాష్ట్ర వైద్యులతో ప్రభుత్వాసుప్రతుల్లో వైద్యానికి ప్లాట్ పాం ఏర్పాటు
రాష్ట్రానికి చెందిన విదేశాలల్లో పనిచేస్తున్న ఉన్నతమయిన డాక్టర్లతో రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిచేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సిఎం ప్రకటించారు. అనేక పనుల మీద విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వైద్యులు వారి పనులు ముగించుకున్న తరువాత మిగిలిన రోజుల్లో వారి వెసులుబాటుతో ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందించేందుకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశామని త్వరలో తుదిదశకు చేరుకుంటుందని సిఎం తెలిపారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బినగర్, సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ ఆసుపత్రులుగా మారుస్తున్నామని, ఆరోగ్యశ్రీ, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులు అధికంగా ఈ ఆసుపత్రులకు కేటాయిస్తామని సిఎం తెలియజేశారు. గోషామహాల్‌లో మూడు వేల కోట్లతో 30 ఎకారాల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రిని నిర్మిస్తున్నామని,
అదనంగా పదివేల బెడ్‌లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టిమ్స్ ఆసుపత్రుల పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. గతంలో జరిగిన పోరపాట్లను సరిదిద్దుకుంటూ వస్తున్నామని, వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వైద్య ఆరోగ్యశాఖ సవాల్ లాంటిదని, శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు వైద్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉందని సిఎం తెలిపారు. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నామని, పేదల విద్య, వైద్యం కోసం ఖర్చు చేసే వాటిలో కోత విధించమని, అవసరమయితే మరిన్ని నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు.