Reading Time: 2 minutes

మన తెలంగాణ /జగిత్యాల ప్రతినిధి : ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక, పార్టీతో ఉన్న 42 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్‌లో తన అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి, ఎఐసిసి సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాసిన నాలుగు పేజీల రాజీనామా పత్రాన్ని చూపించారు. సమావేశంలో జీవన్‌రెడ్డి సుమారు గంటకు పైగా మాట్లాడి గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎ దుర్కొన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తాను పట్టభద్రుల ఎంఎల్‌సిగా ఉన్నానని, మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక సభ్యుడిగా ఉండి బిఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని, పార్టీలో సీనియర్లకు అవకా శం కల్పించాలని కోరుతూ పలువురి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించానన్నారు.

అయితే జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్న తర్వాత నామినేటేడ్ పదవుల విషయాన్ని పక్కనబెట్టారని ఆయన వివరించారు. 20 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుచుకోవడంతో పాటు సిపిఐ పార్టీకి చెందిన ఒకరు ఉం డగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పుడే నా ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేస్తానంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించి పార్టీలో మీకు సముచిత స్థానం ఉం టుందని సర్ధి చెప్పడంతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ నా గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నా బాధను దిగమింగుకుని పార్టీలో కొనసాగానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నా ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి పట్టపగలు నడి వీధిలో హత్యకు గురి కాగా పార్టీ నుంచి కనీసం ఓదార్పు చేయలేదని ఆరోపించారు. ము న్సిపల్ ఎన్నికల సందర్బంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించా రు. ఆయన మన పార్టీ కాదని స్పీకర్ పేర్కొంటుండగా, కాంగ్రె పార్టీతో సంబంధం లేని ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయానికి ఎలా పిలుస్తారని ప్రశ్నిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు.

40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన నన్ను ప్రతి విషయంలో అణగదొక్కాలని చూశారని, నాకు పోరాటాలు కొత్త కాదని, టిడిపి హాయాంలో చంద్రబాబు నాయుడు, పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్‌పై పోరాటం చేశానని అదే తరహాలో ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై పోరాటం చేస్తానన్నారు. ఎంత కాలం ఈ అవమానాలు భరిస్తూ ఉండాలి?, నీ చెప్పు చేతల్లో ఉండే వాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? నిన్ను ఎదురించేటోడు పార్టీలో ఉండొద్దా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని అణగదొక్కుతున్నావా అంటూ రేవంత్‌రెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. నాకు అడ్డం వస్తే తొక్కేస్తానంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, ఎంత మందిని తొక్కుతావు… మేం జగిత్యాలలో ఎదురు తిరిగితే మమ్మల్ని ఎవరూ ఆపలేరన్నారు.