Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యారు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా తన కుడి మోకాలిలోని లిగమెంట్‌కు గాయం కావడంతో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. తర్వాత అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తీసుకున్నారు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న రాణా.. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నందున ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో నవదీప్ సైనిని తీసుకున్నట్లు కోల్‌కతా ప్రకటించింది.

కుడిచేతి వాటం పేసర్ నవదీప్ సైని ఇప్పటివరకు ఆడిన 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా 23 వికెట్లు తీశాడు. గాయపడిన హర్షిత్ స్థానంలో అతను 75 లక్షల రూపాయలకు కేకేఆర్‌లో చేరనున్నాడు.

అలాగే, గాయపడిన పృథ్వీరాజ్ యర్రా స్థానంలో ఖేజ్రోలియాను గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఎంపిక చేసింది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఖేజ్రోలియా గతంలో జీటీ, కేకేఆర్, ఆర్‌సీబీ తరఫున ఆడాడు. ఇప్పుడు 30 లక్షల రూపాయలకు జీటీలో చేరనున్నాడు.