
మనతెలంగాణ/హైదరాబాద్: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడిందన్న భయం ప్రజల్లో నెలకొంది. పలు పెట్రోల్‌బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడమే ఇందుకు కారణం. అయితే, నోస్టాక్ పేరుతో కొందరు బంక్‌ల యజమానులు పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నోస్టాక్
ప్రస్తుతం కొన్ని మండలాలు, గ్రామాల్లో రెండు, మూడు పెట్రోల్ బంక్‌లు ఉంటే అందులో ఒక పెట్రోల్‌బంక్‌లో మాత్రమే డీజిల్, పెట్రోల్ లభ్యం అవుతుండడంతో వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత లేదని, ప్రజలు భయాందోళనలతో పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేయవద్దని, గ్యాస్ సిలిండర్‌ను అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని ప్రజలకు పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారులు, ప్రజలు మాత్రం యుద్ధం భయాన్ని వీడడం లేదు. దీంతోపాటు పెట్రోల్‌బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో వాహనదారులు మరింత ఆందోళన చెందుతునన్నారు.
మూడు బంక్‌ల్లో బ్లాక్ దందా
ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌బంక్‌ల్లోనూ బ్లాక్ దందా నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలో మూడు బంక్‌లు ఉండగా అక్కడ పనిచేసే సిబ్బంది ఈ దందా నడిపిస్తున్నారని వారిని పౌర సరఫరాల శాఖ అధికారులు వెనుకుండి నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దందాతో ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు కోట్లలో నష్టం వాటిల్లిందని, అయినా సివిల్ సప్లయ్ కమిషనర్‌కు లెక్కలు చూపకుండా కొందరు ఉద్యోగులు తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.