
కొడంగ్‌లో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్న డిమాండ్ దృష్టా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొడంగల్‌లో మరోక ఆయిల్ పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇకో పామ్ ఆయిల్, ఫ్యాట్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీ గంటకు పది టన్నుల సామర్ధం కలిగిన మిల్లు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. మిల్లు ఏర్పాటు చేయడానికి 50 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు. భూ కేటాయింపులు జరిగిన సంవత్సరం కాలంలో రూ. 75 కోట్లతో మిల్లు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మిల్లు ఏర్పాటుతో ప్రత్యక్షంగా వంద మందికి,
పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జాతీయంగా పామాయిల్ డిమాండ్ కోటి మెట్రిక్ టన్నులుగా ఉందని, భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతుల ద్వారా వంట నూనెల లోటును సమకూర్చుకుంటున్నామన్నారు. వంట నూనెల దిగుమతుల్లో పామాయిల్ వాటా సుమారు 60 శాతం ఉందని, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం అవసరమని అంచనా ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్‌సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాలతో కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు రాష్ట్ర రైతులకు మేలు చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.