Reading Time: 2 minutes

ప్రబంధ సాహిత్యం అనగానే స్త్రీల అంగాంగ వర్ణనలు గుర్తొస్తే అది చదువరి తప్పు కాదు. పాఠకులకు చేరువయ్యేందుకు దేహ వర్ణన అవస రం అనుకొని ఉంటారు ఆ కాలం కవులు. భాగవతం రాసిన పోతన భోగినీ దండకం కూడా రా శాడని గుర్తొస్తే ప్రాణం చివుక్కుమంటుంది. స్త్రీని భోగ వస్తువుగా చూసిన కాలం నుండి దూ రంగా జరగటం కాల్పనిక ప్రపంచానికి పునర్జన్మ లాంటిది. అలా దూరంగా జరిగిన ఇరవయ్యో శతాబ్దిలో స్త్రీ సంబంధ ఉద్వేగాన్ని వస్తువుగా చేసుకున్నవాడు కృష్ణ శాస్త్రి. ‘ఆమె కన్నులలో ననంతాంబరపు నీలినీడలు కలవు’ తరహా వాక్యా లు అంతకు పూర్వం ఎవరూ రాయలేదు. ఈ ‘అనంతాంబరాల నీలి నీడలు’ అనే మా ట దగ్గర లక్కలా అతుక్కుపోతాం. వస్తువులోకి దూరి దాన్ని పొట్టులా చెక్కటం, పద్యానికి చెఱకు తీపి అద్దటం అతడి కవిత్వ లక్షణం.పద్యమైనా, గేయమైనా ఒక్కలాగే సానబెడతాడు.

కనులు మూసి నేను కలత నిద్దురపోవ

జాజిపూవుల మాల జారి చెక్కిలి తాక

వెదకేనునలుదిశలు అతనేమొ అనుకొని

అంటాడు. ఎవరి సమీపాలు మనను జాజిపూల మాలలా తాకుతాయో వాళ్ళు వద్దన్నా మన ఆవరణలో నిండి ఉంటారు. అక్కడ నిద్ర లేమి కూడా పద్యంగా మారుతుంది. ఐతే కృష్ణ శాస్త్రి పలవరించే అజ్ఞాత స్త్రీ మూర్తి జీవన్ నందదాస్ కలవరించే వనలతాసేన్వంటిది కాదు. వాళ్ళిద్దరి ఆవరణలు ఒక్కటి కావు. జీవన్ దా తన పద్యాన్ని వనలతాసేన్ ఎదురుగా కూర్చొని చెపుతున్నట్టు చెబుతాడు. కృష్ణ శాస్త్రి తనలో సొమ్ముసిల్లిన స్త్రీ మూర్తి హృదయాన్ని పద్యంగా చేస్తాడు. కన్నీటి కెరటాలకు వెన్నెలద్దటం, నిట్టూర్పు గాడ్పులకునెత్తావి పులమటం లాంటి మాయలెన్నో చేస్తాడు. తనలో నిశ్శ్వాస తాళవృంతాలున్నాయని, కన్నీటిసరుల దొంతరలున్నాయని చెప్పుకుంటాడు. కోమల త్వం, స్త్రీత్వం ఏక కాలంలో ముప్పిరిగొంటాయేమో రాసినంత మేరా కంపించి పోతాడు కృష్ణ శాస్త్రి. ఇంతటి లాలిత్యం ఉన్న వాక్యాలు తన సమకాలీన కవులెవరూ రాయలేదు. ఈ క్రింది పంక్తి ఒకసారి చూడండి-.

తమిబిగిసిపోవు నొక్క సంధ్యావసాన

సాంద్ర కాశ్మీరదృఢపరిష్వంగ మందు

నిమిడి, నిలు వెల్ల ఒదిగి శోషిలినయామె

నేను తొలిసారి కాంచి కంపిలితి నాడు.

శోషిల్లటం, కంపించటం అనే సాధారణ విషయా లు కవిలో ఒదిగినప్పుడు అవి చదువరికి కూడా బట్వాడా కావాలి. లేనప్పుడు ఆరాతలు కృతకం గా ఉంటాయి. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం సంపుటాలలో కృష్ణశాస్త్రి ఉద్వేగాలు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 1925లో వచ్చిన కృష్ణ ప క్షానికి ఇప్పటికి వందేళ్ళు. విశ్వనాథ చెప్పినట్టు నా రుచి బతుకు నాది కనుక ఉబికిందొక పలవరింత.

– రఘు

9676144904