
ఇరానీ కేఫ్‌లో నల్లమబ్బుల తెల్ల చొక్కా
టేబుల్ మీద టీ కప్పులోంచి లేచి
జోగుతూనే పడగలు విప్పి ఆడే పాములు
ఎక్కడో కరెంటు తీగమీంచి పడిన
కాకి చుట్టూ మూగిన కాకుల అరుపులు
చమురు మబ్బుల పొగలు
కేఫ్‌లో తారూ, చమురు కలిసి నల్లటి వర్షం
నల్లమబ్బుల తెల్ల చొక్కా
నెత్తిమీది టోపీ తీసి మీద పెట్టే సరికి
టోపీతో పాటు వచ్చేసిన పుర్రె మీది చిప్ప
టేబుల్ మీది టీ కప్పు లేచి డిప్పలేని తలని
కప్పులా అందుకుని సిప్పు చేస్తుంది
సుళ్లు తిరుగుతూ తలల్ల్లోంచి లేస్తాయి
ఆకాశంలోకి రంకెలు వేస్తూ
ఆబోతుల ప్రవాహాలు
సుడి మధ్యలోనేమో కొండ దిగే
గంగిగోవులు, గోధూళి జలపాతంలో
విస్తరించే విద్యుల్లతలు
తల లోపలి మనిషి కల భగ్నమౌతుంది
సవ్యాపసవ్యంగా మనిషి
అణువులు కొంటాయి
తలలోపలి మనిషి తలపగిలి విలపిస్తాడు
రెండు శతగ్నులుపైకి లేచి గర్జిస్తాయి
మొబైల్ తుపుకూ తుపుకూ
విరామం లేకుండా ఆకాశంలోకి
మిసైళ్లని ఉమ్మేస్తాయి
పెంటగన్లో నూక్లియర్ లేవు
డిప్పల్లేని తలకాయల్లో, ఎప్పటికీ
ఆకలి తీరని డైనోసార్లున్నాయి
కుప్పల కుప్పల వార్‌హెడ్స్ మధ్య నుంచి
చమురు సముద్రం మీద తేలే
స్కూలు పిల్లల సమాధుల మధ్య నుంచి
శిశువును ఎత్తుకుని పరుగెడుతోన్న
ఓ పిచ్చి తల్లి
ఆమెను మిసైళ్లతో బీ12 బాంబర్లతో
వెంటాడే సామ్రాజ్యం
ఆపండ్రా బాబూ ఆపండి, అరుస్తోంది
ఓ చిన్నారి సమాధి
ఇరానీ కేఫ్ ముందు
సింహం తన వెన్నెముకలోంచి
ఓ కొవ్వొత్తిని తీసిచ్చి చేపల్లో కలిసి పోయింది
కొవ్వొత్తిని కపాలంలో వెలిగించింది టీకప్పు
తల లాంతరుగా మారిపోయింది
ఇరానీ కేఫ్ అద్దాల్లో లాంతరు ముఖం
గోడ్ల నిండా లాంతర్లు
టేబుళ్ల చుటూ లాంతర్లు
కేఫ్‌కి వచ్చిపోయే శబ్ధాలన్నీ లాంతర్లు
కేఫ్ బయట రోడ్డు మీద ప్రవహించే లాంతర్లు
భూగోళమంతా లాంతర్లు లాంతర్లు
పిచ్చి తల్లినీ, ఆమె చేతిలో శిశువునీ
వెంటాడే వేటాడే ఉన్మాదుల నుంచి
లాంతర్లే రక్షించాలి
లాంతర్ల కాంతిలోంచి దూకే
సిక్కోలు గంగిగోవులే రక్షించాలి
హరిత గోళాన్ని పొదుగుల్లో మోసే
గోమాతలే రక్షించాలి
– వసీరా