
ప్రేమను నిరూపించుకున్న కుమారులు
మన తెలంగాణ/మద్దిరాల : గజం జాగా కోసం పేగు బంధాన్ని మరచి, సొంత తోబుట్టువుల రక్తం చూడడానికి కూడా వెనకాడని రోజుల్లో…. తండ్రి పేరు గ్రామ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు ఇద్దరు సుపుత్రులు. పరమో సేవా ధర్మః అనే శ్లోకాన్ని ఆచరించి, ఎంతోమందికి సేవలను అందించడానికి బాటలు వేశారు. వివరాల్లోకెళితే మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో కొన్నేండ్లుగా కిరాయి గదుల్లో, చెట్ల కింద, పాత పెచ్చులూడే భవనాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్య సేవలు అందిస్తూ ఉండేవారు. చికిత్స చేస్తున్నప్పుడు పై కప్పు పెచ్చులు.. రోగుల పై, వ్యాక్సిన్ కోసం వచ్చే పిల్లల పై పడుతాయేమో అనే భయాలతో సేవలు అందిస్తూ వచ్చారు . అలాంటి భయానక పరిస్థితుల నుంచి తమ గ్రామస్థులను దూరం చేసేందుకు దోహదహ పడ్డారు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామేశ్వర్ రావు లు. వాళ్ళ నాన్న నాయిని వెంకటేశ్వర్ రావు జ్ఞాపకార్ధం, గ్రామ నడిబొ డ్డున ఉన్న లక్షల విలువ గల 14 గుంటల స్థలాన్ని జిల్లా వైద్య ఆరో గ్య శాఖ కు దానం చేశారు.
గ్రామంలోని కొంతమంది నాయకులకు, గ్రామానికి బహుమతి గా ఇస్తున్నట్లు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి, కుల మతాలకు అతీతంగా తమ నాన్న స్థలంలో ఉచిత ఆరోగ్య సేవలకు మాత్రమే ఉపయోగపడాలని దాతలు కోరారు. స్థలాన్ని దుర్వినియోగం కాకుండా హుటాహుటిన ఆరోగ్య శాఖకు అందించి, గ్రామ స్థాయి ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని నిర్మించాల్సిందిగా గ్రామంలోని కొంతమంది నాయకులు అధికారులను కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే పనిచేస్తున్న రెడ్డిగూడెం గ్రామానికే చెందిన ఓ అధికారి, దాతలకు సంతృప్తి కలిగేలా భవనం ఉండాలని ప్రయత్నం చేస్తూ… చిన్న ఉప కేంద్రం కాదు జాతీయ ప్రమాణాలతో కూడిన ఆదర్శ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను నిర్మించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కలెక్టర్ ల ద్వారా రాష్ట్ర అధికారుల నుంచి నిధుల మంజూరు సాకారం చేసుకున్నారు. ఎక్కడో ఊరి చివరన, చెరువు దగ్గరో, స్మశాన వాటిక దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టిన ఆరోగ్య భవనాల నిర్మాణం కు గ్రామస్తుల ప్రోత్సాహమే కరువయ్యే పరిస్థితుల్లో, రెడ్డిగూడెం గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలుపంచుకోవడం ఆనంది ంచదగ్గ విషయం. దాతలు నాయిని రాజేశ్వర్ రావు మరియు రామే శ్వర్ రావు లాంటి మంచి మనసున్న వ్యక్తులు అన్ని గ్రామాల్లో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి క్షేత్ర సిబ్బందికి రెడ్డిగూడెం గ్రామ పెద్దలు, నాయకులు, దాతలు చేస్తున్న కృషిని ఇతర గ్రామాల్లో చర్చించేలా చేసి, మరికొంత మంది ముందుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మంజూరు అయిన భవన నిర్మాణాన్ని గ్రామ ఆరోగ్య సిబ్బంది డాక్టర్ పరమ్యా నాయక్, అదే గ్రామానికి చెందిన ఏ ఎన్ ఎం హసానబాద ఉమా, ఆశా కార్యకర్త పద్మ లతో పాటు ఇతర ఆశాలు నిబంధనలకు అనుగుణంగా, రోగులకు సౌలభ్యం గా ఉండేలా నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పూర్తి కావడానికి సమన్వయ పరిచారు.
భవన నిర్మాణం పూర్తి కాగానే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు ను గ్రామ నాయకుల సహకారం తో ఆహ్వానించి, దాతల సమక్షంలో ప్రారంభం చేయించారు. ప్రారంభోత్సవం రోజున దాతలు నాయిని రామేశ్వరరావు మరియు నాయిని రాజేశ్వరరా వులను గ్రామస్తుల కరతాల ధ్వనుల మధ్య ఘనంగా సత్కరించి, ఆరోగ్య శాఖ సిబ్బంది వారు చేసిన మేలును కొనియాడారు. దాతలు కూడా తమ నాన్న కలలు కన్నట్లుగా, ఈ భవనంలో ప్రతి గ్రామస్తుడు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నరు. జిల్లా డి ఎం హెచ్ ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ దాతల దాతృత్వాన్ని, గ్రామ నాయకుల సంకల్పాన్ని, ఆరోగ్య మందిర్ సిబ్బంది సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరు ఏ స్థాయిలో ఎంత సహకారం అందించాలో, అంతకుమించిన పట్టుదలతో అందించడంతోనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. జిల్లాలో బెస్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మాత్రమే కాకుండా, జాతీయస్థాయిలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సర్వీస్ అందిస్తున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందే వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది కష్టపడతారని ఆయన హామీ ఇచ్చారు.
ఇది తెలుసుకున్న దాతలు వారి తండ్రి నాయిని వెంకటేశ్వరరావు ను తలుచుకొని, వారి స్థలంలో గ్రామస్తులకు జరుగుతున్న మేలును కళ్ళారా చూస్తూ ఆనందభాష్పాలతో కళ్ళు చెమర్చాయి. ప్రభుత్వ సహకారంలో కొంత ఆలస్యం వలన, ఏదైనా మందుల సరఫరా ఆలస్యం ఉంటే గ్రామస్తుల కోసం తామే మందులు కూడా పంపిస్తామని స్థల దాతలు ప్రకటించడం అభినందనీయం. దగ్గుల మల్లయ్య నేలను చదును చేయడం జరిగింది. మరికొంత మంది గ్రామస్థులు సైతం ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కుక్క కాటు మరియు టీటీ లాంటి ఇంజెక్షన్ ల కోల్డ్ చైన్ ప్రక్రియ కోసం స్థల దాతలే ఫ్రిజ్ ను కూడా బహుకరించడం విశేషం. ఈ నిజ సంఘటనలో అంతా మూకుమ్మడిగా, ఎలాంటి భేద భావాలకు తావు లేకుండా, వారు అనుకున్నది సాధించడంలో రెడ్డిగూడెం టీమ్ చూపించిన ఐకమత్యం పలువురికి ఆదర్శం. జ్ఞాపకార్ధకంగా కట్టే ఎవరికీ పనికిరాని సిమెంట్ కట్టడాల కన్నా… నలుగురికి ఉపయోగపడే హెల్త్ సెంటర్, బస్ స్టాండ్, గ్రంథాలయం, తాగు నీరు పంపిణీ లాంటి సేవలకు స్థలాన్ని ఇవ్వడమో, లేక నేరుగా నిర్మాణాలు చేయడమో చేస్తే అదే నిజమైన జ్ఞాపకార్ధం. వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని పలువురు చర్చిస్తున్నారు.
ప్రజా ఆరోగ్యం మెరుగు పరిచేందుకు సిద్ధం
– తీగల ఉపేంద్ర వెంకన్న, గ్రామ సర్పంచ్ రెడ్డిగూడెం
గ్రామ ప్రజల ఆరోగ్యానికి దోహదపడే హెల్త్ సెంటర్ కి కావాల్సిన సహకారం అందిస్తాం. గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది ద్వారా భవనం లోపల మరియు చుట్టు పక్కల పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తాం. స్థల దాతల ఉద్దేశాన్ని అమలు అయ్యేలా చేసి, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుని, వైద్యాన్ని మరింత చేరువయ్యేలా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తుల సహాకారం మరువలేనిది.