
తొలిరోజు రూ.3,446 కోట్లు 68.90 లక్షల మంది రైతులకు లబ్ధి
నర్మెట్ట వేదికగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 20 రోజుల్లో
రెండో విడత రైతు భరోసా ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్ :
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఆదివారం విడుదలయ్యాయి. రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సుమారు 70 లక్షల మందికి పైగా రైతు భరోసా ద్వారా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. దీని కోసం తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఆదివారం మొదటి దశలో భాగంగా ఎకరం వ్యవసాయ భూమి విస్తీర్ణం కలిగిన 57,44,907 ఎకరాలకు 68,89,955 మంది రైతులకు రూ. 3,446.94 కోట్లు విడుదల చేసింది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ నిధులు సోమవారం రైతుల బ్యాంకుల ఖాతాలకు చేరనున్నాయి. రెండో విడతగా 20 రోజుల్లో రూ.2,650 కోట్లు, తర్వాత మూడో విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు వ్యవ0సాయ భూమి ఉంది. మిగిలిన 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో మొదటి విడతలో ఎకరం భూమి కలిగిన 24.32 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో 30 రకాల పంటలను పండిస్తున్నారు. వీటిని 2.14 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 1.28 కోట్ల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి ప్రధాన పంటలుగా వేస్తున్నారు. తర్వాత స్థానాల్లో మొక్కజొన్న, కందులు, సోయాబీన్ ఉన్నాయి.
నాలుగవ విడతలో తొమ్మిది వేల కోట్లు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. తాజాగా రైతుభరోసా నాలుగో సీజన్‌కు నిధులు రైతులకు అందనున్నాయి. ప్రభుత్వం 2023, -24 యాసంగి సీజన్లో ఎకరానికి ఐదు వేల చొప్పున రూ.7,625 కోట్లు జమ చేయగా, 2024, -25 యాసంగి సీజన్లో ఐదు వేల చొప్పున రూ.5,057 కోట్లు, 2025-,26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి సాయాన్ని ఆరు వేలకు పెంచి 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు దశల వారీగా నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుల భరోసా పథకంలో అత్యధికంగా నల్గొండ జిల్లా 5,22,313 రైతులకు రూ. 268.57 కోట్లు, ఖమ్మం జిల్లా 3,35,377 మంది రైతులకు రూ. 169.51 కోట్లు ఉండగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 24,935 మంది రైతులకు రూ. 10.43 కోట్లు, ములుగు 79,040 రైతులకు రూ. 40.98 కోట్లు అత్యల్పంగా రైతు భరోసా నిధులు విడుదలయిన జిల్లాలుగా ఉన్నాయి.