Reading Time: < 1 minute

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ పేరుతో ప్రజల్ని బయటకు రానివ్వకుండా చేశాయి. ఈ వైరస్ ప్రభావం ఐపిఎల్‌పై కూడా పడింది. దీంతో 2021 సీజన్ ఐపిఎల్‌ను అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్‌ మధ్య కొన్ని మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించారు. ఇద్దరు ప్లేయర్లకు కొవిడ్ పాజిటివ్‌గా రావడంతో లీగ్‌ను నిర్వహకులు మధ్యలోనే ఆపేశారు. దీనంతటికీ వరుణ్ చక్రవర్తి కారణం అంటూ సోషల్‌మీడియాలో అభిమానులు అతన్ని ఏకిపారేశారు.

భుజం నొప్పితో బాధపడుతున్న అతను బయోబబుల్ దాటి బయటకు వెళ్లడంతో అతడికి కరోనా వైరస్ సోకింది. అతడితో పాటు సందీప్ వారియర్‌కూ వచ్చింది. దీంతో ఆ తర్వాతి మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ‘‘నా ఐపిఎల్ కెరీర్‌లో 2021 సీజన్ అత్యంత దారుణమైంది. నాకు కొవిడ్ రావడం వల్ల లీగ్ మధ్యలోనే వాయిదాపడింది. పాజిటివ్ వచ్చిన తొలి ఆటగాడిని నేనే. దీంతో బయట నుంచి అభిమానులు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన లీగ్ మధ్యలోనే ఆగిపోవడంతో వారికి కోపం వచ్చింది. ఇంకా బతికే ఉన్నావా? అంటూ కామెంట్లు వచ్చాయి’’ అని వరుణ్ వెల్లడించాడు.