Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతున్న ఈ దాడులు ప్రపంచ సరఫరా గొలుసును కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈద్, నౌరోజ్ పండుగల శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ, ఈ పర్వదినాలు పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వం, సుభిక్షత తీసుకురావాలని ఆకాంక్షించారు. సముద్ర మార్గాల్లో రవాణా స్వేచ్ఛను కాపాడడం అత్యంత కీలకమని, నౌకా మార్గాలను తెరిచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. యుద్ధం ప్రారంభమైన తరువాత మోడీ,

ఇరాన్ అధ్యక్షుడితో జరిపిన రెండో ఫోన్ సంభాషణ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించగా, ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండటం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. ప్రపంచ ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో, దీనిపై ఎలాంటి అంతరాయం వచ్చినా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యలనూ చర్చలు, దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని చెబుతూ, భారత్ స్థిరమైన వైఖరిని మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. అనంతరం సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా తదితర దేశాల నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు.