Reading Time: < 1 minute

మెగా డాటర్ నిహారిక కణిదెల తొలిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. ‘రాకాస’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిహారిక.  విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట ఎవరితో చెప్పాలనుకున్నారని అడగగా.. ఈ నిర్ణయం తీసుకున్నాక మొదట తన తండ్రి నాగబాబుకే చెప్పానన్నారు. ఆయన మొత్తం విని సైలెంట్ అయ్యారని, తాను సంతోషంగా లేననే విషయం వాళ్లకూ తెలుసన్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే తనకు సలహా ఇచ్చారని తెలిపారు. ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరని.. అయితే, తమ మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించుకోలేనివని, అందుకే విడాకులు తీసుకోవడం మంచిదని ఇద్దరం నిర్ణయించుకున్నామని చెప్పారు.

కాగా, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ.. 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2023లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత నిహారిక సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నిర్మాత మారి ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఆమె ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. రెండో చిత్రంగా ‘రాకాస’ను తెరకెక్కించారు. హర్రర్ కామెడీ ప్లస్ ఫాంటసీ’ జానర్‌లో రూపొందిన సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.