Reading Time: < 1 minute

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పెద్దిపాలెం గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకొని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసం ఉంటున్నారు. గేదెకు నీరు పెట్టేందుకు వెళ్లగా అక్కడ కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. 20కి పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకొనేందుకు వీలు లేకుండా పోయింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబుల్లి తనకు ఉన్న 3 ఎకరాల తోటలో తన కుమార్తె కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని.. అయితే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని గ్రామస్థులు వాపోయారు.