
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోరుట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వస్తే స్వాగతిస్తామని సంజయ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతోవ మాట్లాడుతూ.. “జీవన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి.. ఆయన మా పార్టీలోకి వస్తే, నేను భుజాల మీద మోసుకుని తీసుకొస్తా” అని అన్నారు.
ఇదిలావుంటే, జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఆయన అనుచరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన బిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమేనని ప్రచారం ఊపందుకుంది.
కాగా, గత 42 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న తనకు పార్టీలో నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కడంలేదని జీవన్ రెడ్డి ఇటీవల తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్.. ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు.