
ఇంధన సరఫరాపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్ లోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
అదనపు ముడి చమురులేదు : ఇరాన్ స్పందన
అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.