
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా వద్ద శనివారం ముస్లింలు భారీ ఎత్తున్న ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనల అనంతరం ఆయన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసమంతా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగియడం
పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల షాపింగ్ అవసరాలకు, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి సహకారంతో వేడుకలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. పండుగ ఏర్పాట్లలో సహకరించిన మత పెద్దలకు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సిపి సౌత్‌రేంజ్ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సిపి ట్రాఫిక్ డి.జోయల్ డెవిస్, జాయింట్ సిపి నార్త్ రేంజ్ ఎన్. స్వేతా, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపి ఆర్.వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ట్రాఫిక్ డిసిపి అవినాశ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.