
అమరావతి: మిద్దె తోటల పెంపకం దారుల సమూహం ఉందని తనకు ఇప్పటి వరకూ తెలియదని, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని అన్నారు. మిద్దె తోటల పెంపకం ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. గుంటూరు కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేష్ పదో వార్షికోత్సవం జరిగింది. వార్షికోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని, మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని మనవి చేస్తున్నానని అన్నారు. వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితేనే లబ్ధి జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని, సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రశేఖర్ సూచించారు.