Reading Time: 2 minutes
Donald Trump Announces Plans To End Iran Military Action

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యను ముగించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన స్వయంగా ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌తో సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో అమెరికా తన లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక దళం, నావికా దళాలను అమెరికా సైన్యం సమర్థవంతంగా దెబ్బతీసిందని, ఆ దేశం సైనిక సామర్థ్యం ఇప్పుడు గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని క్రమంగా తగ్గించి, యుద్ధాన్ని ముగించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి ‘కాల్పుల విరమణ’ (Ceasefire) ప్రకటించడానికి మాత్రం ట్రంప్ సమ్మతించడం లేదు. ఇరాన్ మళ్ళీ కోలుకోకుండా ఉండే వరకు నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేయకుండా చూడటమే అమెరికా ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ గనుక మళ్ళీ అణు కార్యకలాపాలకు పాల్పడితే.. ఊహించని రీతిలో స్పందిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?

పశ్చిమాసియాలో తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. ఆయా దేశాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. ఇరాన్ ముప్పు నుంచి వారిని కాపాడటంలో అమెరికా తన బాధ్యతను నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ విషయంలో ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. ఇకపై అక్కడ నౌకల రక్షణ బాధ్యతను ఆ మార్గం ద్వారా ప్రయాణించే దేశాలే చూసుకోవాలని ఆయన సూచించారు. అమెరికా ఎల్లప్పుడూ ఉచితంగా రక్షణ కల్పించదని, ఒకవేళ తమ సహాయం కావాలంటే ఆ దేశాలు అభ్యర్థించాలని స్పష్టం చేశారు. ఇరాన్ ముప్పు పూర్తిగా తొలగిపోతే అసలు ఆ ప్రాంతంలో భద్రతా సమస్యలే ఉండవని ఆయన విశ్లేషించారు.

మొత్తానికి.. ట్రంప్ ప్రకటన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందనే ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ.. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి తీసుకుంటే.. ఈ ప్రాంతంలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.