July 11, 2026

Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?

Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?
Reading Time: < 1 minute
Mahesh Kumar Goud Challenges Ktr For Drug Test Says Cm Revanth Reddy Is Ready

శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. గత పదేళ్లలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విస్తృతంగా వ్యాపించాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను డ్రగ్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తానని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమా? అని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.

‘మీరు మీ నాయకుడిని డ్రగ్స్ టెస్టుకు తీసుకురండి. నేను మా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తాను’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌కు చెందిన ఒక నాయకుడు పట్టుబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రశ్నించారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు సరైన సందేశం ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. డ్రగ్స్ సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరారు.

Also Read: Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!

డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీ-ఫారమ్ ఇచ్చే ముందు డ్రగ్స్ టెస్టులు చేయాలని సూచించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారంలో నేరుగా పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. గాంధీ విగ్రహం అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీ నది పరిస్థితిపై కూడా స్పందిస్తూ.. అభివృద్ధి లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తాత్కాలికమేనని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.