July 8, 2026

Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. మావిగన్‌పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. మావిగన్‌పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Reading Time: 2 minutes
Peddireddy Ramachandra Reddy Backs Mavigan Slams Amaravati Project On Ysr Jayanthi

Peddireddy Ramachandra Reddy: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, మావిగన్ ప్రాజెక్టు, ఎన్నికల ప్రక్రియతో పాటు పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా మావిగన్ ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పెద్దిరెడ్డి అన్నారు. మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. మావిగన్‌పై అసంతృప్తి ఉంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాత్రమేనని, ప్రజల్లో మాత్రం పూర్తి ఆమోదం ఉందని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్సీపీలో మావిగన్ అంశంపై ఎలాంటి విభేదాలు లేవని, ఈ విషయంలో పార్టీ నాయకులు పార్టీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారం కేవలం చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్నదేనని కొట్టిపారేశారు పెద్దిరెడ్డి.. ఇదే సమయంలో.. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాటిని వృథా చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడని విధంగా భారీ ఖర్చులు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.

మరోవైపు.. ప్రశ్న రావణ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారని, అలాంటి వ్యక్తిని తాము తీసుకొచ్చి మాట్లాడించే అవసరం లేదని అన్నారు. ఇక, విజయవాడలో సాయి అనే యువకుడి హత్య ఘటనను ప్రస్తావించిన పెద్దిరెడ్డి, హత్య చేసిన తర్వాత అతనిపైనే క్రిమినల్ ముద్ర వేయడం తెలుగుదేశం పార్టీ, జనసేనకే సాధ్యమని తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత.. చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ సక్రమంగానే సాగుతోందని, అయితే కుప్పంలో మాత్రం తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం జీవించిన మహానేత అని పెద్దిరెడ్డి కొనియాడారు. మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని అన్నారు. అలాగే జలయజ్ఞం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వరంలా మారిందని గుర్తు చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..