July 8, 2026

చైనాలో వరదలు.. 20 మంది మృతి..మరో 331 మందికి తీవ్ర గాయాలు..ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!

చైనాలో వరదలు..  20 మంది మృతి..మరో 331 మందికి తీవ్ర గాయాలు..ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!
Reading Time: 2 minutes

చైనాలో వరదలు.. 20 మంది మృతి..మరో 331 మందికి తీవ్ర గాయాలు..ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!

Caption of Image.
  •     మరో 331 మందికి తీవ్ర గాయాలు..వేలాది ఇండ్లు ధ్వంసం
  •     హెంగ్‌‌జౌ ప్రాంతంలోని ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు!

బీజింగ్:  చైనాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టాయి. దేశవ్యాప్తంగా సంభవించిన వరదల్లో ఇప్పటిదాకా 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 331 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో అనేక నగరాలు, గ్రామాలు నీట మునిగాయి. వరదల ధాటికి హెంగ్‌‌జౌ ప్రాంతంలోని ఒక పెద్ద జంతువుల పెంపకం కేంద్రం (ఫామ్) పూర్తిగా కూలిపోయింది.  దీంతో అందులో పెంచుతున్న సుమారు 900 పాములు ఒక్కసారిగా వరద నీట్లో కొట్టుకుపోయాయి. పాములన్నీ గ్రామాల వైపు వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

నడుములోతు వరద నీటిలో నిలబడి, వెదురు కర్రలు, చేపల వలలతో జనం పాములను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇళ్లలోకి పాములు వస్తే ఎవరూ సొంతంగా చేతులతో పట్టుకోవద్దని, వాటిలో ఎక్కువ భాగం విషపూరితమైనవి కాకపోయినా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పాములను పట్టుకోవడానికి అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు

చైనాలోని గాన్సు ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని ముంచెత్తాయి. మట్టి దిబ్బల కింద 33 మంది చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్స్​21 మందిని వెలికితీశాయి. అయితే, వారిలో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘోర విపత్తుపై చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

62 నదులు ప్రమాద స్థాయికి..

భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా సుమారు 62 నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని చైనా వాతావరణ  శాఖ అధికారులు వెల్లడించారు. క్వింగ్‌‌షుయ్ నది చరిత్రలోనే గరిష్ట వరదను నమోదు చేసింది. తూర్పు హుబై ప్రాంతంలో వచ్చిన భయంకరమైన తుఫాను, వడగళ్ల వానలలో 11మంది చనిపోయారు. అక్కడ 22 భవనాలు కూలిపోగా, దాదాపు 5 వేల ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో 400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, నాన్నింగ్ సిటీలో ‘మైసాక్’ తుఫాను కారణంగా కురిసి న భారీ వానలకు నలుగురు మరణించారు. 

©️ VIL Media Pvt Ltd.